కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్.. జనసేన ఖాతాలో విశాఖ ఎంపీ సీటు!!

 

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 23 న రానున్న ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పటివరకు ఎవరి అంచనాలు వారివి. గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరి ధీమా ఆనందంగా మారనుందో, ఎవరి ధీమా బాధగా మారనుందో మే 23 న తేలనుంది. అయితే ఇప్పుడు ఓ లోక్ సభ స్థానం ఫలితంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదే విశాఖ లోక్‌సభ స్థానం. ఇక్కడ టీడీపీ, వైసీపీలకు షాకిస్తూ జనసేన అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విజయం సాధిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. ఇది జేడీ లక్ష్మీనారాయణకు సానుకూలంగా ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని పరిధిలోని గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్న పవన్‌ కళ్యాణ్ మినహా.. మిగిలిన స్థానాల్లోని జనసేన అభ్యర్థులు బలమైన వారు కాదు. ఆయా నియోజకవర్గాలకు వారు వ్యక్తిగతంగా పెద్దగా తెలిసినవారు కాకపోవడంతో అది లక్ష్మీనారాయణపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది భావించారు. పైగా విశాఖ బరిలో ఉన్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు అన్ని విధాలుగా బలవంతులు. దీంతో లక్ష్మీనారాయణ గెలుపుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలింగ్ తరువాత మాత్రం అందుకు భిన్నమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.

విశాఖలో టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. తను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని వందరూపాయల బాండ్‌ పేపర్‌పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు. నగరంలో ఉంటున్న ఇతరరాష్ట్రాల ఓటర్లతో వారివారి భాషల్లో మాట్లాడడం కూడా ఆయనకు కలిసివచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా లక్ష్మీనారాయణకు టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అదే జరిగితే జనసేన ఖాతాలోకి విశాఖ ఎంపీ సీటు వచ్చినట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.