TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాట మళ్లీ మొదలైన క్యాంపు రాజకీయాలు

Published on: Thu May 7, 2026 8:38AM

తమిళనాడు రాజకీయాలు మరోసారి  ఉత్కంఠభరితంగా మారాయి.   కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా క్యాంపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపాడుకునేందుకు అన్నాడీఎంకే అధిష్టానం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలను బుధవారం ( మే 6) పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు  తరలించింది.

తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ' తమిళగ వెట్రి కళగం  (టీవీకే) 108 స్థానాలతో  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే..  ప్రభుత్వ  ఏర్పాటుకు  అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో  ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని టీవీకే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరగడంతో అన్నాడీఎంకే  అప్రమత్తమైంది.

సీనియర్ నేత సీవీ షణ్ముగం ఆధ్వర్యంలో పుదుచ్చేరిలోని  ది షోర్ త్రిశ్వమ్  రిసార్టులో దాదాపు 20 గదులను పార్టీ ముందుగానే బుక్ చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపుతో ..  అటు టీవీకే కూడా తమ ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురం రిసార్టులకు తరలించింది. ఒకవైపు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతుంటే.. మరోవైపు బద్ధ శత్రువులుగా పేరున్న డీఎంకే మరియు అన్నాడీఎంకే నేతల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తమిళరాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి. 

ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కోరగా.. సంపూర్ణ మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే రావాలని గవర్నర్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.  ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పార్టీలకు సవాలుగా మారింది. రానున్న రెండు మూడు రోజుల్లో సంఖ్యా బలంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత వరకూ తమిళనాట క్యాంపు రాజకీయాలు కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.