గంటి ప్రసాద్ కు జగన్ పార్టీ పిలుపు
Published on: Mon May 7, 2012 10:05AM
కడపజిల్లా కాంగ్రెస్ పార్టీకి కొద్దో, గొప్పో కార్యకర్తల బలం ఉన్న నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే గంటి ప్రసాద్ ఒకరు. రైల్వే కోడూరు ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఈశ్వరయ్యకు టిక్కెట్టు కట్టబెట్టడంతో గంటి ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జిల్లాలో చాలామంది నేతలకు పదవులు ఇచ్చి న్యాయం చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యేగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు గుర్తింపు ఇవ్వడంలేదన్న అసంతృప్తితో గంటి ప్రసాద్ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు గంటి ప్రసాద్ ను తమ పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వై.ఎస్. జగన్ కు సమీప బంధువైన ఒక నాయకుడు గంటి ప్రసాద్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కలవరానికి గురవుతున్నారు. ఎన్నికలకు ముందు గంటి ప్రసాద్ పార్టీని వీడితే రైల్వేకోడూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంటుందని వారు భయపడుతున్నారు.


