దీదీకి కోల్‌కతా హైకోర్ట్ షాక్!
Published on: Thu Jun 18, 2026 4:42PM

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తదుపరి విచారణ జరిపేంత వరకు స్పీకర్ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ పిటిషన్ తదుపరి విచారణకు ముందే అఫిడవిట్ల మార్పిడిని పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది న్యాయస్థానం. ప్రతివాదులు మూడు వారాల్లోగా తమ వ్యతిరేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని, దానిపై మరో పక్షం వారు రెండు వారాల్లోగా స్పందించాలని గడువు విధించింది. ఈ విషయంపై తదుపరి విచారణ జులై 28కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు ఫలితం వెలువడే వరకు రితబ్రత బెనర్జీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.


