క్యాబినెట్ సమావేశంతో కాంగ్రెస్ హడావుడి

 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశం భుజాలకెత్తుకొన్నపటి నుండి నేటి వరకు దానిని సమర్ధంగా పరిష్కరించలేక ఎప్పటికప్పుడు కోర్ కమిటీలు, అంటోనీ కమిటీలు, టీ-నోట్, కేంద్ర మంత్రుల, నేతల వ్యాఖ్యలతో రోజులు నెట్టుకు వస్తోంది. రాష్ట్రంలో ఏదయినా హడావుడి కనబడగానే అది డిల్లీలో కూడా ప్రతిఫలిస్తుంటుంది. అంత మాత్రాన్నఅక్కడేదో కీలక నిర్ణయాలు జరిగిపోతాయని కాదు. కేవలం ప్రజలని, పార్టీలని, చివరికి తన స్వంత పార్టీ నేతలని భ్రమింపజేయడానికి మాత్రమే ఆ డ్రామా అంతా.

 

గత వారంలో కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ తిరుగుబాటు జండా ఎగురవేయడం, కేసీఆర్ ‘కాంగ్రెస్ కాకుంటే బీజేపీ ఉండనే ఉందని’ ప్రకటించడం, జగన్ కూడా మోడీని పొగిడి, ఆయన బీజేపీని సెక్యులర్ దారికి తీసుకువస్తే మద్దతు ఇవ్వచ్చుననట్లు మాట్లాడటం, తెదేపా బీజేపీల మధ్య వికసిస్తున్న స్నేహబంధం, ఏపీయన్జీవోలు మరో 15రోజుల సమ్మెకు సిద్దపడటం వంటి అనేక పరిణామాలతో మేల్కొన్నకాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ రేపు క్యాబినెట్ సమావేశంతో హడావుడి చేయనుంది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో టీ-నోట్ రాష్ట్ర శాసనసభకు పంపడం వలన భంగపాటు ఎలాగు తప్పదు. అంతే గాక స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాన్నికూల్చుకోవలసిన పరిస్థితి దాపురిస్తుంది. అయినప్పటికీ సమస్యలేవీ పరిష్కారం కాకపోగా మరింత చిక్కుముడులు పడవచ్చును. అందువలన టీ-నోట్ పై క్యాబినెట్ సమావేశంలో మళ్ళీ మరో మారు చాలా లోతుగా అధ్యయనం చేసేసిన తరువాత ఏవో కొన్ని సూచనలతో హోంశాఖకు దానిని త్రిప్పిపంపి చేతులు దులుపుకోవచ్చును. తద్వారా టీ-నోట్ ను క్యాబినెట్ లో చర్చించినందుకు అటు టీ-నేతలను, దానిని ముందుకు కదపకుండా అక్కడే ఉంచుతూ ఇటు-సీమాంధ్ర నేతలను చల్లబరిచే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫలానా జిల్లాలను రాజధానిగా చేయడానికి పరిశీలిస్తున్నామని ప్రకటించడం ద్వారా సీమాంధ్రలో ఉద్యమాలను, ఉద్యోగుల సమ్మెలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయవచ్చును. రాజధానికోసం వారందరూ కత్తులు దూసుకొంటుంటే కాంగ్రెస్ అధిష్టానానికి మరికొంత సమయం చిక్కుతుంది. ఒకవేళ ఇదే కారణంగా ఉద్యమాలు సమ్మెలు నిలిచిపోతే అప్పుడు ఇక తనను ప్రశ్నించేవరెవరూ ఉండరు గనుక తాపీగా రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలుపెట్టవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu