కేబినెట్ లోకి ప్రసాద్..సబిత ఇమేజ్ డామాజ్
Published on: Tue Feb 7, 2012 10:22AM
హై
దరాబాద్: ప్రసాద్ కుమార్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం ద్వారా రంగా రెడ్డి జిల్లాలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టినట్లయింది. 2004లో వైయస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి జిల్లా కాంగ్రెస్‌లో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తిరుగులేదు. అయితే ఇపుడు ప్రసాద్ కుమార్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో సబిత వర్గానికి మింగుడుపడడం లేదు. అందుకే ఆమె మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి కూడా రాలేదని అంటున్నారు. సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా ఏకమై జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. జిల్లాలో ప్రసాద్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, మాజీ మంత్రి కమతం రామిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కె.ఎం.ప్రతాప్‌తో పాటు మరికొందరు సీనియర్లు సబితతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సబిత పాల్గొనే కార్యక్రమాలకు కూడా వారంతా దూరంగా ఉంటున్నారు. తన సొంత నియోజకవర్గమైన వికారాబాద్‌లో ఆదివారం జరిగిన మహిళా పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ప్రసాద్‌కుమార్ దూరంగా ఉన్నారు. ఈ పోలీస్‌స్టేషన్‌ను హోంమంత్రి సబితారెడ్డి ప్రారంభించడంపై ప్రసాద్ అలకవహించారు. ఇప్పుడు ప్రసాద్‌కు మంత్రి పదవి లభించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో సబిత, ప్రసాద్‌ల మధ్య అధిపత్యపు పోరు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.


