ఎమ్మెల్యే ఆర్థర్‌ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాతో డీల్!!

కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఎమ్మెల్యే ఆర్థర్‌ కు, వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య అస్సలు పడదనేది బహిరంగ రహస్యం. తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సిద్ధార్థరెడ్డిపై ఆర్థర్‌ ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే నియోజకవర్గంలో ఒకటి చోటుచేసుకుంది. రేషన్‌ షాపుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. అయితే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో సిద్ధార్థరెడ్డి కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే ఆర్థర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, చివరికి అధికారులే కల్పించుకొని వివాదానికి తెరదించారని తెలుస్తోంది.

 

నందికొట్కూరు నియోజకవర్గానికి అధికారులు 61 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. అయితే, తుది నిర్ణయం తీసుకునే సమయంలో పాములపాడు మినహా మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితానే ఫైనల్‌ చేయాలని అధికారులపై ఒత్తిడి వచ్చిందట. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్‌.. పార్టీ జిల్లా ఇంఛార్జ్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే అయిన తనను ఒక్క మండలానికే పరిమితం చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, అప్పటికే ఫైనల్‌ అయిన జాబితాను పక్కన పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని అధికారులకు ఫోన్‌ చేసి హెచ్చరించారట. దీంతో లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ఇక చేసేదేమీ లేక అధికారులు 'ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా'ను తెరపైకి తీసుకొచ్చారట. పాములపాడు మండలం ఎమ్మెల్యేకు, పగిడ్యాల మండలం సిద్ధార్థరెడ్డికి ఇచ్చే విధంగా ఒప్పించారట. మిగిలిన మండలాలలతోపాటు నందికొట్కూరు అర్బన్‌, రూరల్‌ పరిధిలో ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తామని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారట. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఎంపిక చేసేలా డీల్ కుదిర్చారన్నమాట. ఈ డీల్ కి ఇరువురు నేతలు ఒప్పుకోవడంతో వివాదానికి తెరపడిందని సమాచారం.