TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బైరెడ్డి అందుకే తెదేపాలో చేరాలనుకొంటున్నారా?

Published on: Fri Jan 2, 2015 12:50PM

 

రాయలసీమకు చెందిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ కూడా సీమకు ద్రోహం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై ప్రశంశలు కురిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఆయన అనుమతిస్తే తాను తెదేపాలో చేరేందుకు సిద్దమని మొన్న కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే తను తెలుగుదేశంలో జేరాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు.

 

కానీ ఇదే బైరెడ్డి సార్వత్రిక ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్న అన్ని రాజకీయపార్టీలకు గట్టిగా బుద్ధి చెపుతానని ప్రగల్భాలు పలికారు. కానీ ఆయనపై పోలీసులు ఒక హత్యానేరం క్రింద కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా కాలం తరువాత అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతానని చెప్పడం హాస్యాస్పదం. ఆయన పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీలో చేర్చుకొంటారా? అంటే అనుమానమే. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే, ఆయన అందులో జేరెందుకే మొగ్గు చూపేవారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటంతో, వైకాపాలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేమనే ఆలోచనతోనే ఆయన తెదేపాను ఎంచుకొన్నారని చెప్పవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయనను పార్టీలో చేర్చుకోకపోతే అప్పుడు ఆయన చంద్రబాబుని నిందిస్తూ బీజేపీ వైపు పరుగు తీయవచ్చును.