ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలు: బైరెడ్డి

 

   

రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డిరాజశేఖర్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన ఒక ముగిసిపోయిన అధ్యాయమని, ఇక అందులోఎవరూ ఏమిచేయగలిగేదేమి లేదని, ఆర్ధిక మంత్రి పార్లమెంటులో చేసిన ప్రకటన గమనిస్తే అది స్పష్టంగా అర్ధం అవుతోందని, అయినప్పటికీ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఇంకా ఏదో అవకాశం ఉందని, తామేదో చేయబోతున్నామని ప్రజలను మోసగించడం దారుణమని ఆయన అన్నారు.

 

కేంద్రం రాష్ట్ర విభజన చేసి, తెలంగాణా రాష్ట్రం ఏర్పరచబోతోందని కాంగ్రెస్ నేతలకు ఆరునెలలు ముందుగానే తెలిసి ఉన్నపటికీ, వారు తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు ఇంతకాలంగా ప్రజలను మభ్యపెడుతూ వచ్చి, ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ నాటాకాలు ఆడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇందుకు వేరెవరినీ నిందించడం అనవసరమని, రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలే దీనికంతటికీ కారణమని ఆయన విమర్శించారు.

 

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం కూడా జరిగిపోయిన తరువాత ఇప్పుడు సీమాంధ్ర మంత్రులు రాజీనామా డ్రామాలు ఆడుతుంటే, రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాదిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకెక్కడం కేవలం నాటకం మాత్రమేనని ఆయన విమర్శించారు. ఇక రాష్ట్ర విభజనపై ఎవరెన్ని వాగ్వాదాలు చేసుకొన్నపటికీ వాటివల్ల ఒరిగేదేమీ ఉండదని ఆయన స్పష్టం చేసారు.