TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బై బై జగన్.. ట్విటర్‌లో ట్రెండింగ్..

Published on: Fri Apr 8, 2022 5:53PM

‘బైబై.. వైఎస్ జగన్..’ ఈ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా బాగా హల్ చల్ చేస్తోంది. సీఎం జగన్ పరిపాలన తమకు ఇక వద్దంటూ ఏపీ ప్రజలు ట్విట్టర్ లో పెద్ద ఎత్తున హోరెత్తిస్తుడడం విశేషం. సీఎం జగన్ రెడ్డి పరిపాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ 31 వేలకు పైగా బైబై వైఎస్ జగన్ అంటూ ట్వీట్లు చేయడం గమనార్హం. ఏపీలో అమలవుతున్న విద్యుత్ కోతలను నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావనకు తెస్తున్నారు. గత ఎలక్షన్లకు ముందు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ‘బైబై.. వైఎస్ జగన్’ హ్యాష్ ట్యాగ్ టాప్ గేర్ లో ట్రెండింగ్ అవుతుండడం విశేషం.

ఏపీలో గత కొన్నాళ్లుగా విద్యుత్ కోతలు జనాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్ టీపీసీ లాంటి జాతీయ సంస్థలకు బకాయిలు చెల్లించకుండా తాత్సారం చేయడంతో అవి ఏపీకి విద్యుత్ సరఫరాను కొద్ది రోజులు నిలిపేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తోంది జగన్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో ప్రైవేట్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి.

ఈ క్రమంలో అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ సర్కార్ కొన్ని రోజులుగా రాష్ట్రంలో అనధికారికంగా విద్యుత్ కోతలు అమలు చేస్తోంది. తాజాగా పరిశ్రమలకు కూడా వారాంతపు హాలిడేస్ తో పాటు వారంలో మరో రోజు కూడా పవర్ హాలిడే ప్రకటించాలని ఆదేశించింది. విద్యుత్ సరఫరా లేక ఏపీలోని అనేక ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషన్లను వైద్యులు సెల్ ఫోన్ లైట్ల వెలుగులో నిర్వహించాల్సిన దుస్థితి వచ్చింది. విద్యుత్ సరఫరా లేక, ఒక వేళ ఉన్నా వాడిన కరెంట్ కు యూనిట్ ధరలు పెంచడంతో ఏపీ వ్యాప్తంగా ప్రజలు విసుగెత్తిపోతున్నారు.

మరో పక్కన ఒక్క ఛాన్స్ అంటూ పవర్ లోకి వచ్చిన వైఎస్ జగన్ తీరా పదవిలోకి వచ్చాక తాను ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని అనేక మంది ఆరోపిస్తున్నారు. స్వయంగా జగనే ఇచ్చిన హామీల్ని కూడా అమలు చేయకపోవడం పట్ల అందరూ ఆగ్రహంతో ఉన్నారు. పవర్ లేక, పనులు జరగక, ఉద్యోగ వ్యాపారాలు సాగక, ఆదాయం అందక ఏపీలోని అనేక వర్గాల ప్రజలు వైసీపీ సర్కార్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే బైబై జగన్ అంటూ.. జగన్ దిగిపోవాలంటూ సోషల్ మీడియా వేదిక తమ అసంతృప్తిని, అయిష్టతను బహిరంగంగా ప్రకటిస్తున్నారు.