నాయకా.. నిన్ను నువ్వు తరచి చూసుకో!
Published on: Mon Jun 6, 2022 4:54PM
తగ్గాల్సిన చోట తగ్గాలి అన్నది ఓ సినిమా డైలాగ్. అందునా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్. సినీ రచయిత రాసిచ్చినది బాగానే చెప్పి చప్పట్లు కొట్టించుకున్నాడు. అంతవరకూ బాగానే వుంది. కానీ ఇటు రాజకీయా ల్లోనూ ఓ కాలుపెట్టి ఏకంగా సీ.ఎం అయిపోవాలన్న ఆతృతతో పొత్తుల విషయంలో అవతలి వారికి ఆప్షన్లు ఇస్తున్న సమయంలో తానేమి మాట్లాడుతున్నావో గ్రహింపులేకుంటే ఎలా నాయకా?
వాళ్లన్నారు, వీళ్లన్నారు అనిగాదు కానీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తులకి వున్న ప్రాధాన్యత మరిదేనికీ లేదు. జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో తన సత్తా ప్రదర్శించాలనుకున్న మహానటుడు తాను నిజంగా రాజకీయరంగంలోకి దిగానన్న స్పృహ కలిగేవున్నాడనే అనుకోవాలా? ఎందుకంటే, పార్టీ పెట్టి మూడేళ్లే అయింది. వెయ్యి మంది సినీ వీరాభిమానులు తమ హీరోని సీ.ఎం గా చూసుకోవాలన్న హడా వుడి చేయగానే ఇక తనకు తిరుగులేదని అనుకోవడమే పవన్ అమాయకత్వం. పైగా రెండు పర్యాయాలు ఇతరు లకు ఛాన్స్ ఇచ్చాను. ఇపుడు నా వంతు అంటూ అందరూ తప్పుకోండి మనం వస్తున్నాం అని స్టయిల్‌గా డైలాగ్ చెప్పినంత చక్కగా అనేశాడు.
కానీ ఇది సినిమా కాదు. సినిమా చూపించే రాజకీయ రంగం. ఇక్కడ చేతులు తిరిగినవారు, రాజకీయ చదరంగంలో తలనెరిసినవారు మెదడు బాగా వేడెక్కి నవారు అనేకం. వాళ్లకే హెచ్చరికలా డైలాగ్ విసుర్లు విసిరితే ఎలా? బిజెపి మద్దతు వుందని ఓట్లు చీల్చడం ద్వారా తనకు అవకాశం వుంటుందన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ వున్నారు. బిజెపి మద్దతునిస్తుందని ఎలా నమ్మడం. వాళ్లు ఎప్పుడు జగన్‌ని కుర్చీలోంచి తోసేసి బజేపీ నేతనే కూర్చోబెడదామా అని చాలారోజులుగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే తమకు తోడ్పడితే మంచి జరుగు తుంది ఆలోచించుకోవాలి అన్నది పవన్‌కు బిజెపి వర్గాలు చూచాయిగా ఇచ్చిన సందేశం. తప్ప తనని కుర్చీలో కూర్చోబెడతామని కాదు. కానీ పవన్‌కి ఇలా అర్ధమయింది.
అయ్యా పవర్ స్టార్‌గారూ మాకే అధికార పగ్గాలు పట్టే అవకాశం వుండగా మిమ్మల్ని ఎలా ఎక్కిస్తామన్నారు. లేటెస్ట్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అదే మాట మరింత స్పష్టం చేసారు. టిడిపికి ఈసారి అధి కారం చేపట్టగల సత్తా వుందని, ఖచ్చితంగా చంద్రబాబు సీ.ఎం అవుతారని టిడీపీ వర్గాలు గట్టిగా నమ్ము తున్నాయి, ప్రచారం చేస్తున్నాయి. పరిస్థితులు వారికి ఎంతో అనుకూలిస్తున్నపుడు బాబు మాత్రం సీఎం సీటును త్యాగం చేస్తారని ఎలా అనుకున్నారు పవన్ కళ్యాణ్?
ఊహించుకోవడానికి, అనుకున్నది అయిపోతుందని గట్టిగా నమ్మడానికి పరిస్థితులను బేరీజు వేసుకోవాలి, మన స్థాయి ఏమిటన్నది తెలుసుకోవాలి గదా? ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఆప్షన్లు ఇస్తున్నారన్నది పోనీ పవర్‌స్టార్ సలహాదారులకి తెలియాలి గదా?! రాజు నేనే, మంత్రినీ నేనే అనుకుంటే ఎలా? మంత్రిలా మంచి సలహాలిచ్చేవారు లేకపోవడం వల్లనే ఈ లేనిపోని ఖంగాళీ ప్రకటనలు. మరంచేత, పవన్ ప్లీజ్ ఎక్కడ, ఎప్పుడు ఏమి అనాలో నేర్చుకో. తప్పులేదు. ఇది రాజకీయరంగం, ఇక్కడ ప్రతీ ఒక్క రికీ ఈ వైకుంఠపాళి లో ఎన్ని పాములు, తేళ్లుంటాయన్నది బాగా ఎరుకే!


