రెండేళ్లలో నేనే సీఎం..మీరు ఇంటికే..!

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన సహజ లక్షణాన్ని మరోసారి ప్రదర్శించారు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ఈ ఉదయం దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికై గురైంది. ఈ ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలవ్వగా..25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సహాయక బృందాలు నందిగామ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నాయి. క్షతగాత్రులను పరామర్శించేందుకు, అలాగే మృతుల బంధువులను ఓదార్చేందుకు జగన్ నందిగామ చేరుకున్నారు. బాధితులను పరామర్శించి..వారికి ధైర్యం చెప్పారు.

 

 

అయితే బస్సు డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేయకుండానే పంపించేశారని ఆరోపించిన ఆయన డాక్టర్ వద్ద ఉన్న డ్రైవర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ బాబు జగన్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ సహా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కిందిస్థాయి నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల వరకు అవినీతిలో కూరుకుపోయారని.. రెండేళ్లలో నేనే రాబోతున్నాను...వచ్చిన మరుక్షణం మీరంతా ఇంటికేనని తీవ్రంగా హెచ్చరించారు.

 

 

జగన్ అఖిల భారత స్థాయి అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి..గతంలో ఏపీ ప్రత్యేక హోదాకు నిరసన తెలిపేందుకు విశాఖ వెళ్లిన జగన్‌ను ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకోవడంతో..అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నగర పోలీస్ కమిషనర్‌ యోగానంద్‌ను కూడా ఇలాగే మీ పేరుతో సహా గుర్తుపెట్టుకుంటా..ముఖ్యమంత్రిని అయిన వెంటనే మీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. తాజాగా మరోసారి కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో సివిల్ సర్వీస్ ఉద్యోగులు ప్రతిపక్షనేత ప్రవర్తనపై త్వరలోనే నిరసన చేసే ఆలోచనలో ఉన్నారు.