కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది దుర్మరణం
Published on: Tue Feb 28, 2017 9:09AM

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద అదుపుతప్పి కల్వర్టులో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలవ్వగా...మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను నందిగామ, జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.


