చెన్నైలో ఫ్లైఓవర్ పైనుండి పడిన బస్సు: ఒకరి మృతి
Published on: Wed Jun 27, 2012 4:05PM
చెన్నైలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ బస్సు ప్రమాదం సంభవించింది. బ్రాడ్వే నుండి వడపళని వెళ్ళే సిటీ బస్సు (17ఎం. నెం.) జెమీనీ ఫ్లైఓవర్ మీదుగా వెళుతూ అదుపు తప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయ పడ్డారు.
సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బస్సు నుంగంబాక్కం హైవే రోడ్డు వైపు ఫ్లైఓవర్ పైనుండి క్రిందికి దిగుతున్నప్పుడు బస్సు అదుపు తప్పడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు చెప్పారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.


