TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

600 మందిని కాల్చేశారు!

Published on: Sat Oct 5, 2024 12:09PM

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలోని బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు దాదాపు 600 మందిని పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చి చంపారు. ఆగస్టులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైకులపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కన్పించిన వారినల్లా కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే. అల్ బైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ (జేఎన్ఐఎం) మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. బుర్కినాఫాసోలో తరచుగా మిలిటెంట్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గ్రామాల చుట్టూ లోతైన కందకాలు తవ్వుకోవాలని అక్కడి మిలటరీ ఆదేశించింది. దీంతో ఆగస్టు 24న బర్సాలోగో ప్రజలు తవ్వకాలు జరుపుతుండగా ఉగ్రవాదులు వారిని సైనికులుగా భావించి దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టినా వెంటాడి మరి కాల్పులు జరిపారని తెలుస్తోంది.  ఈ ఘటనలో 200 మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి మొదట అంచనా వేసింది. కానీ, దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. ఘటన తర్వాత మృత దేహాలను సేకరించేందుకు అధికారులకు మూడు రోజుల సమయం పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత బుర్కినా ఫాసో వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ, వాటిని సైన్యం అణచివేసింది.