ప్రధానితో సహా.. దేశ భద్రతకు సంబంధించిన ఎన్ఐసీ కంప్యూటర్ల హ్యాక్... 

కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి, మోదీతో సహా దాదాపు 10 వేల మంది భారతీయ ప్రముఖులపై చైనా గూఢచర్యం చేస్తోందన్న వార్త మరిచిపోకముందే ఈరోజు మరో సెన్సేషనల్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) కు చెందిన కంప్యూటర్లు హ్యాక్ కు గురయ్యాయి. వీటిలో దేశ భద్రతకు సంబంధించిన అనేక అంశాలు అలాగే ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. తాజాగా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ లోని ఉన్నతాధికారులు ఈ విషయాన్నితెలిపారు. ఈ కంప్యూటర్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ సహా పలువురు ప్రముఖులు, దేశ భద్రతకు సంబంధించిన ఎంతో సమాచారం ఉందని వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఈ హ్యాకింగ్ అంతా కూడా బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుండి జరిగినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఎన్‌ఐసీ కి చెందిన ఉద్యోగులకు ఓ మెయిల్ వచ్చిందని, అందులోని లింక్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ లు హ్యాక్ అయ్యాయని అధికారులు తెలిపారు. అమెరికాకు చెందిన కంపెనీ ఒకటి బెంగళూరులో ఉందని, ఆ కంపెనీ నుండి ఈ ఈ-మెయిల్ వచ్చిందిని తెలుస్తోంది.