టీడీపీ, బీజేపీ భవిష్యత్తు @ ఏపీ అభివృద్ధి

 

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమర్పించిన బడ్జెట్ సామాన్య ప్రజలను ఆకట్టుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అటువంటి ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే దాని వలన ప్రజలు సంతోషించేవారేమో గానీ, అది దేశాభివృద్ధికి ఏమాత్రం దోహదపడదు. రానున్న రెండు మూడేళ్ళలో ద్రవ్యోల్భణాన్ని పూర్తిగా నియత్రించి, ఆర్ధికవృద్ధి రెటు గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తునందున బడ్జెట్ తో ప్రజల మెప్పు పొందే ప్రయత్నాలు చేయలేదు.

 

ఇక బడ్జెట్ లో మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తరువాత తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ప్రత్యేక సహాయం అందించకపోవడం సహజంగానే రాష్ట్ర ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఆగ్రహం కలిగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు దీనినొక రాజకీయ ఆయుధంగా మలచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు సిద్దం అవుతుంటే, వారి నుండి ఒకపక్క తీవ్ర విమర్శలను ఎదుర్కొంటూ, బీజేపీతో సంబంధాలు దెబ్బ తినకుండా, రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం తాము భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏవిధంగా నిలదీయాలని తెదేపా సందిగ్ధంలో ఉంది.

 

చంద్రబాబు నాయుడితో సహా తెదేపా నేతలందరూ మీడియా సమక్షంలోనే తమ అసంతృప్తిని తెలియజేసారు. దానిని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇరువురూ ఖండించారు. అటువంటి విషయాల గురించి బహిరంగం మాట్లాడేకంటే నేరుగా ప్రధానితో మాట్లాడుకొంటే బాగుంటుందని వెంకయ్య నాయుడు సున్నితంగా హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం మరిన్ని నిధులు కేటాయించవలసి ఉందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఏర్పాటు వంటి అంశాలపై గత ప్రభుత్వం సరయిన కసరత్తు చేయకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోన్నందునే ఇటువంటి పరిస్థితి కలిగిందని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. విష్ణు కుమార్ రాజు కూడా బడ్జెట్ పట్ల అసంతృప్తిని వ్యక్తపరుస్తూనే, చంద్రబాబు నాయుడు సరిగ్గా కృషి చేయనందునే నష్టపోవలసి వచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అదుకొంటామని మోడీతో సహా బీజేపీ నేతలందరూ పదేపదే రాష్ట్రప్రజలకు హామీలు ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు కూడా. కానీ అవి ఆచరణలో కనబడకపోవడంతో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రజలకు సంజాయిషీలు చెప్పుకొనే పరిస్థితి ఎదురవుతోంది.

 

తెదేపా, బీజేపీల రాజకీయ భవిష్యత్ రాష్ట్రాభివృద్ధి మీదే పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ వాస్తవాన్ని తెదేపా ప్రభుత్వం బాగానే గుర్తించింది. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం వంటివి పూర్తి చేయాలని ఆరాటపడుతోంది. కానీ బీజేపీ ఇంకా గుర్తించినట్లు లేదు. అందుకే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలను ప్రత్యేక దృష్టితో చూడకుండా మిగిలిన రాష్ట్రాలతో సమానంగా చూస్తున్నట్లుంది.

 

దేశాభివృద్ధి కోసం ఆర్ధిక క్రమశిక్షణ పాటించాల్సిందే. కానీ అదే సమయంలో రాష్ట్ర విభజన కారణంగా ఘోరంగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కూడా కేంద్రం మీదే ఉంది. తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి ఇటువంటి సమయంలోనే కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా రాష్ట్రానికి ఏదో మొక్కుబడిగా నిధులు విడుదలచేసి చేతులు దులుపు కొన్నట్లయితే, మున్ముందు ఈ సమస్యలు మరింత పెరిగి రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినట్లయితే, అప్పుడు ఆ సమస్యల నుండి రాష్ట్రానికి బయటపడేసేందుకు ఇంతకు పదింతలు ఆర్ధిక సహాయం చేయవలసి వస్తుంది.

 

కేంద్రం ఇప్పుడు రాష్ట్రానికి అన్ని విధాల సహాయపడినట్లయితే రాష్ట్రం త్వరగా నిలద్రొక్కుకొని తిరిగి ప్రతిఫలాలను కూడా అందించగలదు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయపడితే రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు. దాని వలన బీజేపీకే మేలు జరుగుతుంది. అలాకాక రాష్ట్రానికి ఇదేవిధంగా అరకొర నిధులు విదిలిస్తూ హామీలతోనే కాలక్షేపం చేసినట్లయితే ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో బీజేపీకి కూడా తెలుసు.