TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్ పై ప్రణబ్ వ్యాఖ్యలు

Published on: Fri Mar 16, 2012 11:56AM

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక ఒడిదుడుకులు ఉన్న నేపథ్యంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ ఇది అని భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో శుక్రవారం దేశ 81వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక రంగం మందగమనంలో ఉన్నా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ముడిచమురు ధరలు, ప్రపంచ పరిస్థితుల ప్రభావాన్ని తాము పరిగణిస్తున్నట్టు చెప్పారు. యూరప్, సంక్షభం, మధ్యప్రాచ్య రాజకీయం, పరిస్థితుల ప్రభావం ప్రపంచంపై ఉందని ఆయన అన్నారు. మరోవైపు వృద్ధి రేటు తగ్గుదల దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు.


రానున్న రెండేళ్లలో అహార భద్రత బిల్లును పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తూ నందన్ నీలేకని కమిటీ సిఫార్సులు పరిశీలిస్తున్నట్టు చెప్పారు. సబ్సిడీ ఫలాలను లబ్ధిదారులకు అందేలా నీలేకని సూచించిన మేరకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు వచ్చే ఆరు నెలల్లోగా 50 జిల్లాల్లో పెలైట్ ప్రాజెక్టు అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 51 శాతం వాటాను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బ్యాంక్ కరస్పాండెట్ల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, అందులో భాగంగా పారిశ్రామిక మౌలిక వసతుల కోసం 50 లక్షల కోట్ల రూపాయలు సమకూరుస్తున్నామని అన్నారు.


భారత్‌లో ఆర్థిక వృద్ధి రేటు 6.9 శాతంగా ఉందని ప్రణబ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది 2012-13 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. దేశంలో ఆర్థిక పునరుజ్జీవనానికి ఐదు సూత్రాల ప్రణాళిక అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎగుమతులకు కొత్త మార్కెట్ల అన్వేషణ ఫలించిందనీ, అదే ఆర్థిక సంక్షోభం నుంచి భారత్‌ను కాపాడిందని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2.5 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని తెలిపారు. ముడి చమురు ధరలు పెగడం ప్రధాన సమస్యల్లో ఒకటిగా విశ్లేషించారు.


ప్రజా జీవితంలో నల్లధనానికి చోటు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ప్రణబ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే, లబ్ధిదారులకు 6 నెలల్లో కిరోసిన్, ఎల్‌పీజీ సబ్సిడీ అందించే పైలట్ పథకం ప్రారంభించనున్నట్టు ప్రణబ్ తెలిపారు.