ప్రణబ్ బడ్జెట్ ఊరట నిచ్చేనా?
Published on: Fri Mar 16, 2012 11:21AM
న్
యూఢిల్లీ: పార్లమెంటులో ఏడోసారి తన మార్కు బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ సిద్ధమయ్యారు. స్వతంత్ర భారత్‌లో 81వ బడ్జెట్‌ను ఆయన శుక్రవారం ఉదయం 11 గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు బడ్జెట్ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. స్పీకర్ మీరాకుమార్ సభ్యులను వారించటంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆర్థికశాఖ మంత్రిగా అత్యధికసార్లు ప్రవేశపెట్టిన వారిలో ప్రణబ్ రెండవ వారు. పార్లమెంటులో ఇప్పటికి వరకు 80 బడ్జెట్ ప్రసంగాలు జరిగాయి.
పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్‌లో కాస్త ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు. పన్ను విధింపునకు ఆదాయ పరిమితిని రూ 2 లక్షల రూపాయలకు పెంచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. టాక్స్ బ్రాకెట్స్‌పై ఆదాయం పన్ను పరిమితిని 10, 20, 30 శాతం పెంచవచ్చునని అంటున్నారు. చౌక ధర ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే 15 లక్షల రూపాయల రుణంపై ఒక శాతం వడ్డీ విధించే అవకాశాలున్నాయి. లగ్జరీ సరుకులపై సుంకాలను పెంచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. గురువారం పార్లమెంటు ముందు ఉంచిన ఆర్థిక సర్వే కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది.


