జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా.. సజ్జలకు బుద్దా స్ట్రాంగ్ కౌ

ఏపీలో గతేడాది కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు ప్రకాశం బ్యారేజ్ నుండి నీటిని కిందికి వదలకుండా చంద్రబాబు ఇంటిని ముంచేందుకు.. అలాగే అమరావతిని ముంపు ప్రాంతంగా ప్రపంచం మొత్తానికి చూపేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా కృష్ణా నదికి మళ్ళీ వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా బాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాబును ఉద్దేశించి.. చట్టాన్ని గౌరవించాలని, ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా "చంద్రబాబు గారూ కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి. కోర్టుల ద్వారా మీరు రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?" అంటూ ట్వీట్ చేసారు.

 

తాజాగా సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "అయ్యా సజ్జల రెడ్డి.. చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా? ముందు దొంగ సొమ్ముతో కట్టిన రాజ భవంతులు పేదలకు పంచి, ఆ తరువాత ఇతరులను విమర్శించండి" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. అంతేకాకుండా "అవినీతి బురదలో ఉన్న సజ్జల.. వరద గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతి కట్టలతో కోటలు నిర్మించే వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగే సజ్జల గారు చంద్రబాబు గారి అద్దె ఇంటి కోసం ఆందోళన చెందటం వింతగా ఉంది" అంటూ బుద్ధా వెంకన్న తన తాజా ట్వీట్ లో తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.