రాజీనామా చేస్తా.. ఇక పోటీ చేయను: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి

 

పార్టీ ప్రయోజనాల కోసం సొంత పార్టీ నేతలను ప్రశ్నించడానికి కూడా వెనకాడరని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పేరుంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీఎల్పీ ఉప నేత పదవికి తాను రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల స్పష్టం చేశారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానన్నారు. టీడీపీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని అధిష్టానానికి సూచించారు. ఐదారు సార్లు ఓడినవారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని గోరంట్ల పిలుపునిచ్చారు.

ఆరుసార్లు గెలిచానని.. అయితే భవిష్యత్తులో ఇక పోటీ చేయనని గోరంట్ల తేల్చిచెప్పారు. సంక్షేమం, అభివృద్ధి చేసినా పార్టీ గెలవలేదంటే ఎక్కడో లోపం ఉందన్నారు. మంత్రులు, జిల్లా, మండల స్థాయి నాయకత్వాలు విఫలమయ్యాయి అన్నారు. 'నియామకాల్లో పారదర్శకత కోసం చంద్రబాబు కొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. ఇప్పుడు వైసీపీ.. వాళ్ల పార్టీ కార్యకర్తలకే పదవులు ఇస్తోంది. చంద్రబాబుకు వైఎస్ జగన్‌కు ఉన్న తేడా అది’ అని గోరంట్ల విమర్శించారు. అయితే గోరంట్ల వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.