TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి తీర్మానానికి మద్దతివ్వకుంటే....రూ.15 కోట్లు ఇస్తామన్నది మీరే కాదా? : బీటెక్ రవి

Published on: Tue May 26, 2026 8:19PM

 

ఈ బీటెక్ రవిని కొనడం నీ వల్ల కాదు.. జగన్ వల్ల కూడా కాదు..

ఎంపీ అవినాశ్ రెడ్డిపై  బీటెక్ రవి ఆగ్రహం..

కడప రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. తనను డబ్బుతో కొనడం వైఎస్ అవినాష్ రెడ్డి వల్ల కాదు, ఆయన సోదరుడు వైఎస్ జగన్ వల్ల కూడా కాదంటూ పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బు మీద వ్యామోహం, కక్కుర్తి తనకు లేవని.. అవి మీకే ఉన్నాయంటూ అవినాష్ రెడ్డి సోదరులపై మండిపడ్డారు.

పులివెందులలో సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ మంగళవారం టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. అమరావతి తీర్మానానికి మద్దతు ఇవ్వకుంటే రూ.15 కోట్లు ఇస్తామని చెప్పింది మీరే కాదా అంటూ కడప ఎంపీని సూటిగా ప్రశ్నించారు. తాను విజయసాయిరెడ్డిని కలిసి ఉంటే గత ఆరు సంవత్సరాలుగా ఎందుకు మౌనం పాటించారో చెప్పాలని నిలదీశారు.

2014 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఉలిమెళ్లలోని తన తోటకు పిలిపించి కసునూరు ఎంపీటీసీ అంశంపై ఎందుకు చర్చించారో చెప్పాలని అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కేసు ఉపసంహరణ కోసం తనతో పాటు ఆదినారాయణ రెడ్డికి బ్లాంక్ చెక్ ఆఫర్ చేయలేదా అని సంచలన ఆరోపణలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వివిధ క్యాంపుల్లోని అసంతృప్తుల వివరాలను మీరే తమకు అందించారని బీటెక్ రవి ఆరోపించారు. రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీబీఎం పనులను రద్దు చేయించి రూ.15 కోట్ల కమీషన్ తీసుకుని ఇళ్లు కట్టుకున్నది మీరేనని తీవ్ర విమర్శలు చేశారు.

అరటి రైతుల కడుపు కొట్టి కమీషన్లు తీసుకున్న చరిత్ర మీది అంటూ అవినాష్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఐ రాజేశ్వర్ రెడ్డి, గణకణపల్లి కృష్ణారెడ్డిని అడిగితే మీ ఎర్రచందనం దందాల గురించి చెబుతారన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని స్పష్టం చేశారు.

ఉలిమెళ్ల తోటలో ఎలాంటి ఘటన జరగలేదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ అవినాష్ రెడ్డికి సవాల్ విసిరిన బీటెక్ రవి.. “ఇప్పటివరకు పుష్ప-1 మాత్రమే చూశారు.. ఇంకా పుష్ప-2, పుష్ప-3 కూడా చూపిస్తాం” అంటూ హెచ్చరించారు.