మోడీని అభినందిస్తూనే విమర్శించిన మాయావతి

 

అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి స్పందించారు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మాయావతి స్వాగతించారు. అయితే ఇది కేవలం ‘రాజకీయ ఎత్తుగడ’ మాత్రమేనని ఆమె విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే. కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం మంచిది కాదు. సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తోంది. మరింత ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేది...’’ అని మాయావతి పేర్కొన్నారు. అలాగే వివిధ మైనారిటీ వర్గాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని పరిశీలించాలని మాయావతి సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు కేవలం విద్య, ఉద్యోగాల్లోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.