మునిసిపోల్స్ ఫలితాలు.. బీఆర్ఎస్ పరిస్థితేంటి?

posted on: Feb 14, 2026 10:34AM

తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు.. అన్న చందంగా తయారౌతోంది. ఆ పార్టీ పరిస్థితి, పలుకుబడి వేగంగా దిగజారుతున్న స్పష్టమైన సంకేతాలను తాజాగా వెలువడిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా బలంగా విస్తరించి.. రాష్ట్రంలో ఇక ఈ పార్టీకి తిరుగేలేదా? అన్నట్లుగా నిలిచిన పార్టీ ఇప్పుడు కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైన దృశ్యం విస్మయపరుస్తోంది.

 ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోట అనుకున్న ప్రాంతాలలో కూడా మునిసిపోల్స్ లో బీఆర్ఎస్ చతికిల పడటం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.  కరీంనగర్, నిజామాబాద్  వరంగల్ లలో ఆదరణ లేకుండా పోయింది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.   ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది.  తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ భారీగా పుంజుకోవడం, కాంగ్రెస్  సత్తా చాటడంతో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది.   

ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మహబూబ్ నగర్,   నల్గొండ, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చుకుంది.  సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి   తమ మున్సిపాలిటీని కాపాడుకోలేకపోవడం ఆ పార్టీ పలుకుబడి ఎంతగా దిగజారిందో తేటతెల్లం చేస్తున్నది. ఇక ఖమ్మంలో  బీఆర్ఎస్ పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచింది.   ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క మున్సిపాలిటీ కే పరిమితం కావడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.

  బీఆర్ఎస్ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లా , హైదరాబాద్ శివారు ప్రాంతాలకే పరిమితమైందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  మళ్లీ అధికారంలోకి వస్తాం అని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ క్యాడర్ కు తాజా మునిసిపోల్స్ ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి.  మెదక్, హైదరాబాద్ శివార్లపై ఆధారపడి వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...