TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

Published on: Thu Apr 10, 2025 3:37PM

బీఆర్‌ఎస్ మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌‌కు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. ఓ రోడ్డు యాక్సిడెంట్ కేసు నుంచి తన కుమారుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు షకీల్ పై పోలీసులు గతంలోనే  అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న షకీల్ దుబాయ్ వెళ్లిపోయి కొంతకాలంగా అక్కడే ఉంటున్నారు. తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. షకీల్ భారత్ కు వస్తున్నారనే సమాచారంతో అప్పటికే విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

2023లో షకీల్ కొడుకు రహేల్ వేగంగా కారు నడుపుతూ బేగంపేట ప్రగతి భవన్ ముందు ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయగా.. తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులను తప్పుదోవ పట్టించారు. వెంటనే కొడుకును దుబాయ్ పంపించేశారు. కొడుకును తప్పించేందుకు, దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో షకీల్ పైనా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఈ విషయం తెలిసి షకీల్ కూడా దుబాయ్ పారిపోయారు. గత కొంతకాలంగా దుబాయిలో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ కు పోలీసులు అనుమతిచ్చారని, పోలీసుల సమక్షంలో ఆయన అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. అంత్యక్రియలు పూర్తయ్యాక షకీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్లు తెలిసింది.