TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జూబ్లీ బైపోల్.. బీఆర్ఎస్ చేతులెత్తేసిందా?

Published on: Wed Oct 15, 2025 11:07AM

జూబ్లీ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ విమర్శల జోరు పెంచాయి. బీజేపీ ఇంకా ఒకింత సైలెంట్ గానే ఉంది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాత్రం మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే ఈ మాటల యుద్ధంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ మోడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కంటే ముందుగానే బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పార్టీ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం ఆరంభించేసింది. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టి బీఆర్ఎస్ సానుభూతి వేవ్ పై నమ్మకం పెట్టుకుంది. ఇక కాంగ్రెస్ ఒకింత ఆలస్యమైనా బలమైన అభ్యర్థినే రంగంలోకి దింపిందని పరిశీలకులు అంటున్నారు. నవీన్ యాదవ్ లోకల్ నినాదంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఆరోపణల వ్యూహం ఆ పార్టీకి ఈ ఎన్నికలలో ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుందన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. 

బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో పూర్తిగా సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడినట్లు కనిపిస్తున్నది. వాటిపై కూడా నమ్మకం సన్నగిల్లి.. నకిలీ ఓట్లు, అధికారులు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించడం ద్వారా ముందుగానే ఓటమి భయాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు.  ఎన్నికల ప్రచారంలో  కేటీఆర్.. వేల కొద్దీ దొంగ ఓట్లు చేర్చారని, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారనీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటువంటి ఆరోపణలు సహజంగా ఓటమి భయం నుంచి పుట్టుకువస్తాయని రాజకీయ పండితులు అంటుంటారు.  కేటీఆర్.. బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు ఓటమి భయాన్ని సూచిస్తున్నాయని అంటున్నారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్రమంగా ఇరవై వేల ఓట్లు చేర్చారంటూ కేటీఆర్ నేరుగా సీఈవోకు ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలను రుజువుగా ఆయన  ఓ ఇంట్లో ఏకంగా నలభై మూడు ఓట్లు ఉన్నాయంటున్నారు. అవన్నీ దొంగఓట్లేనని చెబుతున్నారు. ఈ ఆరోపణనే ఆయన కాంగ్రెస్ పై ప్రయోగించిన పెద్ద ఆయుధంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేత బీహార్ లో ఓట్ల చోరీ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారనీ, ఇక్కడ తెలంగాణలో వారి కాంగ్రెస్ పార్టీయే ఓట్ల అక్రమాలకు పాల్పడుతుంటే పెదవి విప్పడం లేదనీ ఆలోచించారు. సరే కేటీఆర్ ఆరోపణపై స్పందించిన ఎన్నికల సంఘం..ఆ ఇంటిలో 43 ఓట్లపై పరిశీలించి.. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని, అది బహుళ అంతస్తుల భవనమని తేల్చేసింది. 

అది పక్కన పెడితే.. కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ తమ ప్రచారంలో జూబ్లీలో గెలిపిస్తే ఏం చేస్తామన్నది చెప్పడం లేదు.. కానీ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే హైడ్రా రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడుతుందంటూ ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారు. తమకు ఓటు వేయడం అని అడగడానికి బదులు కాంగ్రెస్ కు ఓటే వేయవద్దంటూ ప్రచారం చేస్తున్నారు.  ఈ రకమైన డిఫెన్సివ్ వైఖరి బీఆర్ఎస్ లోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.