TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేటీఆర్‌పై క్యాడ‌ర్ గుస్సా!

Published on: Wed Aug 21, 2024 8:18AM

తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కాయి. రుణ‌మాఫీ అమ‌లు, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తారస్థాయికి చేరింది. మేం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాజీవ్ గాంధీ విగ్ర‌హం తొల‌గిస్తామ‌ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన‌డం.. దానికి విగ్ర‌హాన్ని ట‌చ్‌చేసి చూడు.. మా త‌డాఖా ఏంటో చూపిస్తామంటూ    సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో వార్నింగ్ ఇవ్వడం..  క‌చ్చితంగా స‌చివాల‌యం ముందు రాజీవ్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని క్లారిటీగా చెప్పేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచీ రేవంత్ రెడ్డి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. ప్ర‌భుత్వంలోనూ, పార్టీలోనూ త‌న మార్క్ ను చూపుతున్నారు. మంత్రివ‌ర్గం, కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం, పార్టీ క్యాడ‌ర్‌ సైతం రేవంత్ దూకుడుకు అనుగుణంగా అడుగులు వేస్తుండ‌టంతో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల‌ విమ‌ర్శ‌ల‌ను స‌మ‌ర్ధంగా తిప్ప‌కొడుతున్నారు. అయితే బీఆర్ఎస్ లో ఆ ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. నాయ‌క‌త్వ లోపం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి నాటి నుంచి కేసీఆర్ ఇంటికి, ఫామ్ హౌస్ కే ప‌రిమితం కావ‌డంతో ప్ర‌తిప‌క్ష నేత బాధ్య‌త‌ల‌ను, పార్టీ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ చూస్తున్నాడు. అయితే, కేటీఆర్ రాజ‌కీయ వ్యూహాలు రేవంత్ రెడ్డి దూకుడు ముందు తేలిపోతున్నాయి. దీంతో పార్టీ క్యాడ‌ర్‌లో నిస్తేజం నెల‌కొంది.

 అధికారంలో ఉన్న స‌మ‌యంలో రాజ‌కీయ ఓన‌మాలు తెలియ‌నివారైనా గొప్ప రాజ‌కీయ నేత‌గా రాణించ‌గ‌లుగుతారు. కానీ, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడే అస‌లైన స‌మ‌ర్ధ‌త బ‌య‌ట‌ప‌డుతుంది. ప‌దేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండ‌టంతో కేటీఆర్ మంత్రి హోదాలో ఓ వెలుగు వెలిగారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సైతం కేసీఆర్ త‌రువాత కేటీఆరే మా నాయ‌కుడు అని బ‌లంగా న‌మ్ముతూ వ‌చ్చారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన త‌రువాత కేసీఆర్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం కావడతో  ప్ర‌తిప‌క్ష నేత బాధ్య‌త‌ల‌ను, పార్టీ బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ భుజానికెత్తుకున్నారు. కానీ, పార్టీ శ్రేణులు ఆశించిన స్థాయిలో ఆయ‌న‌ రాణించ‌లేక పోతున్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు, కేడర్ బహిరంగంగానే చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు ముందు కేటీఆర్ వ్యూహాలు ఏమాత్రం ప‌నిచేయ‌డం లేద‌న్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో   వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ఎత్తిచూప‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న కేటీఆర్‌.. పార్టీ క్యాడ‌ర్‌ను కాపాడుకోవ‌టంలోనూ విఫ‌లమ‌వుతున్నారు.  బీఆర్ఎస్ త్వరలో బీజేపీలో విలీనం అవుతుంద‌న్న ప్రచారం విస్తృతంగా జ‌రుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంది. విలీనం వార్త‌ల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా తిప్పికొట్టాల్సిన కేటీఆర్‌.. ఆ మేర‌కు స‌ఫ‌లం కాలేద‌న్న వాద‌న‌ రాజ‌కీయాల్లో వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతుంది.. విలీనం వార్త‌ల‌పై కేటీఆర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేత‌లు మీడియా స‌మావేశాలు పెట్టి   ఖండించాల్సి ఉండగా,   కేటీఆర్‌, హ‌రీశ్ రావు, ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన వారెవరూ కనీసం స్పందించలేదు. దీంతో విలీనం వార్త‌ల్లో నిజం ఉందా అన్న అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. 

రేవంత్ స‌ర్కార్‌ చేస్తున్న త‌ప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి పార్టీ క్యాడ‌ర్‌తో క‌లిసి వాటిపై పోరాటం సాగించాల్సిన కేటీఆర్ ఆ పని చేయడంలేదు.  ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేందుకు ఇటీవ‌ల‌ రైతు రుణ‌మాఫీ వ్య‌వ‌హారం ప్ర‌తిప‌క్ష పార్టీకి ఓ ఆయుధంలా దొరికింది. ఆగ‌స్టు 15 నాటికి అర్హ‌త ఉన్న ప్ర‌తిరైతుకు రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పింది. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఖ‌మ్మం జిల్లాలో జ‌రిగిన స‌భ సాక్షిగా ప్ర‌క‌టించాడు. వాస్త‌వానికి కొన్ని టెక్నికల్ కారణాలతో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఆధార్‌లో పేర్లు తప్పుగా ఉండటం.. ఆధార్ సంఖ్యలో తప్పులు దొర్లడం, రెండు లక్షలపైన ఉన్న అమౌంట్‌ను చెల్లిస్తేనే రుణమాఫీ జరుగుతుందనే కండీషన్‌తో రుణమాఫీ జరగలేదు. ప్రభుత్వం కూడా మొదట్లో 31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 18వేల కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసింది. తొలుత రుణ‌మాఫీ విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టేలా దూకుడుగా ముందుకెళ్లిన‌ బీఆర్ఎస్.. అదే ఊపును కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌యింద‌న్న వాద‌న ఉంది.

 స‌చివాల‌యం ముందు రాజీవ్ గాంధీ విగ్ర‌హం ఏర్పాటు విష‌యం తెర‌పైకి రావ‌డంతో కేటీఆర్ ఫోక‌స్ ఆ విష‌యంపైకి వెళ్లింది. మేం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీ విగ్ర‌హాన్ని తీసేస్తాం, విమానాశ్ర‌యానికి కూడా ఆయ‌న పేరును తొల‌గిస్తామ‌ని కేటీఆర్ అనడంతో..  కాంగ్రెస్ నేత‌లు కేటీఆర్ పై విరుచుకుప‌డ్డారు.. ప్ర‌తిప‌క్ష నేత‌లుసైతం దీటుగా స‌మాధానం ఇవ్వ‌డంతో తెలంగాణ రాజ‌కీయాల్లో రాజీవ్ గాంధీ విగ్ర‌హం ఏర్పాటు విష‌యం ప్ర‌ధాన‌ అంశంగా మారింది. అదే విష‌యంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మ‌ధ్య జ‌రిగిన మాట‌ల యుద్దంతో రుణ‌మాఫీ విష‌యం ప‌క్క‌కు వెళ్లిపోయింది. రుణ‌మాఫీ విష‌యం కంటే రాజీవ్ గాంధీ విగ్ర‌హం ఏర్పాటు అంశంపైనే ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయ‌డం ప్ర‌ధానం అన్న‌ట్లుగా కేటీఆర్ వ్య‌వ‌హ‌రించ‌డంతో పార్టీ శ్రేణులు ఆయ‌న తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్ ప‌రిప‌క్వ‌త లేని రాజ‌కీయాల‌తో పార్టీకి మ‌రింత న‌ష్టం వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు బీఆర్ఎస్ నేత‌లు వాపోతున్నారు‌. ఇదే విష‌యాన్ని పార్టీలో కీల‌క నేత‌లు కేసీఆర్ దృష్టికి  తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. మ‌ళ్లీ కేసీఆర్ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో మ‌నుగ‌డ సాధ్య‌మ‌వుతుంద‌ని, క్యాడ‌ర్  పార్టీని వీడ‌కుండా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.