మెదడు వందేళ్లు పనిచేయాలంటే!

వయసు మీదపడుతున్న కొద్దీ మెదుడు చురుగ్గా పనిచేయదన్నది మన ఆలోచన. మెదడులోని న్యూరాన్లు బలహీనపడటమే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్ అనే శాస్త్రవేత్త ఇందుకు పరిష్కారం ఏమన్నా ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. దాదాపు 50 ఏళ్లపాటు చేసిన పరిశోధన ఫలితంగా రేచెల్ ఈ సమస్యకి ఒక పరిష్కారం సాధించానని చెబుతున్నారు.

 

చిన్నప్పుడు మనం ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఈ తరహా విధానానికి ‘Broad learning’ అని పేరు పెట్టారు రేచెల్. ఇక పెద్దయ్యేకొద్దీ మనం నేర్చుకునే తీరు మారిపోతుంది. ఈ విధానానికి ‘specialised learning’ అని పేరు పెట్టారు. వాటి మధ్య తేడాలని ఆరు రకాలుగా వివరించే ప్రయత్నిం చేశారు.

 

1 - చిన్నప్పుడు ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాము (open mindedness). కానీ పెద్దవారిలో ఇలాంటి విశాల దృక్పథం ఉండదు. ఏదన్నా కొత్త విషయం నేర్చుకొనేందుకు వారి అభిప్రాయాలు, విచక్షణ, అహంకారం... మాటిమాటికీ అడ్డం వస్తుంటాయి.

 

2- చిన్నతనంలో అయితే తెలియని విషయాన్ని చెప్పేందుకు టీచర్లు, పెద్దలు ఉంటారు. ఏదన్నా అనుమానం వచ్చినా ఠక్కున వారిదగ్గరకు వెళ్తాము. కానీ పెద్దయ్యాక ఇలా మరొకరి సాయం తీసుకునేందుకు మొహమాటం అడ్డువస్తుంది.

 

3 – కాస్త కష్టపడితే ఏదన్నా నేర్చుకోవచ్చనే నమ్మకం చిన్నతనంలో ఉంటుంది. కానీ పెద్దయ్యాక నమ్మకం మారిపోతుంది. ప్రతిభ పుట్టుకతో రావాలే కానీ, ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదన్న నిర్వేదం పెద్దల్లో కనిపిస్తుంది.

 

4 – చిన్నతనంలో పొరపాట్లు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి పిల్లలు పడుతూలేస్తూ, తప్పులు చేస్తూ నేర్పు సాధించే అవకాశం ఉంటుంది. కానీ పెద్దయ్యాక మనం చేసే పని ఎక్కడ తప్పుగా మారుతుందో, అది ఏ ఫలితానికి దారితీస్తుందో అన్న భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.

 

5 – పిల్లల్లో ఏదన్నా నేర్చుకునేందుకు ఆసక్తి మొదలైతే... అది సాధించేదాకా ఊరుకోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పట్టిన పట్టు విడవరు. కానీ పెద్దలు అలా కాదు కదా! ఏదన్నా హాబీ మొదలుపెట్టారంటే ఓ రెండు నెలల్లోనే దాన్ని చాప చుట్టేస్తారు.

 

6 – పిల్లలు రకరకాల నైపుణ్యాలని ఒక్కసారిగా నేర్చుకునేందుకు (multiple skills) భయపడరు. ఒక పక్క బొమ్మలు గీస్తూనే మరో పక్క డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క చదువుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లు అలా కాదు! ఏదన్నా ఒక విషయం మీద శ్రద్ధ పెడితే, మరో విషయాన్ని పట్టించుకుంటే ఎక్కడ తమ ఏకాగ్రత తప్పిపోతుందో అన్న భయంతో ఉంటారు.

 

ఈ ఆరు విషయాలనీ గమనించి... చిన్నతనంలో మనం ఎలాగైతే నేర్పుని సాధించే ప్రయత్నం చేసేవారమో గుర్తుచేసుకోమంటున్నారు రేచెల్. అవే పద్ధతులని పెద్దయ్యాక కూడా పాటిస్తే వృద్ధాప్యం వయసుకే కానీ మెదడుకి రాదని భరోసా ఇస్తున్నారు.

- నిర్జర.