ఆంధ్రా X తెలంగాణ... నీటి కోసం కొట్లాట

భవిష్యత్తులో జరిగేవన్నీ నీటియుద్ధాలే అని పెద్దలు అంటుంటారు. ఒకప్పుడు నిరాశావాదంగా తోచిన ఈ మాటలు నిజం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. నదులు నిండుగా ప్రవహించే రోజున ఎలాంటి సమస్యా రాకపోవచ్చు. కానీ వరసగా ఓ రెండేళ్లు కరువు వచ్చిందంటే ప్రతి నీటి చుక్కనీ లెక్క వేసుకోక తప్పదు. సహజంగానే లెక్కలున్న చోట గొడవలుంటాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇలాంటి గొడవలే రాజుకుంటున్నాయి.

 


కృష్ణా, గోదావరి, తుంగభద్ర... ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహించే ఈ మూడు నదులూ కూడా తెలంగాణ గుండా ప్రవహించాల్సిందే! ఇలా భౌగోళికంగా తెలంగాణని పైచేయిగా ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు తెలంగాణలో నీటి సమస్యలను నివారించలేకపోయాయన్నది ఒక వాదన. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందనే ఈ వాదనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక నినాదంగా మారింది. అయితే తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల వల్ల, అక్కడి నేల మీద ప్రాజెక్టులు నిర్మించడం ఏమంత తేలిక కాదనీ... అందుకే సులువుగా ప్రాజెక్టులకు అవకాశం ఉండే ఆంధ్రా ప్రాంతంలోనే ఎక్కువ ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయనీ టి.హనుమంతరావు వంటి సాగునీటి రంగ నిపుణులు సైతం చెప్పేవారు.

 


కారణం ఏదైతేనేం.. తెలంగాణ రైతులు వర్షపు నీటిని నమ్ముకుంటూ, బోరుబావులను తవ్వుకుంటూ వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి. భూగర్భజలాలు ఎండిపోవడం, ఏళ్ల తరబడి కరువు రక్కసి కోరలు చాచడంతో... తెలంగాణ రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఈ పరిస్థితిలో మార్పుని తీసుకువచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం అనేక సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట ఇరిగేషన్ వంటి ప్రాజెక్టులతో బీడుపోయిన తెలంగాణ భూములు సస్యశ్యామలం అవుతాయని చెబుతోంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్‌ కూడా పోలవరం వంటి భారీ ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది.

 


నిరంతరం ఎండిపోయి ఉండే కృష్ణానదిలోకి గోదావరి జలాలను కలపడం పోలవరం ఉద్దేశం. అయితే దీని వల్ల తనకు దక్కాల్సిన గోదావరి జలాలు దక్కకుండా పోతాయన్నది తెలంగాణ వాదన. ఇక శ్రీశైలం రిజర్వాయరు నుంచి పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథాకానికి కృష్ణా జలాలను మళ్లించడం వల్ల ఆంధ్రాలోకి రావాల్సిన కృష్ణా జలాలకు కోత పడుతుందన్నది ఆంధ్రప్రదేశ్‌ ఆరోపణ. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు చేసుకున్న ప్రాజెక్టు ఒప్పందాలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు కంటగింపుగా మారాయి. తవ్వుకుంటూ పోతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఇలాంటి నీటి వివాదాలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ల మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నీటి కోసం కూడా ఇరు జిల్లాలూ కొట్లాడుకునే పరిస్థితి ఉంది. నాగార్జునసాగర్‌ నీటి కోసమూ ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులే నెలకొంటున్నాయి.

 


తాజాగా కృష్ణాజలాల వివాదంలో తాను జోక్యం చేసుకోబోనని సుప్రీం తెలంగాణకు తేల్చిచెప్పడంతో... ఇరు రాష్ట్రాల మధ్యా నీటి వివాదం తారస్థాయికి చేరుకున్నట్లయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కృష్ణా నదీ జలాలలను తిరిగి పంపిణీ చేయాలని తెలంగాణ కోరుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలను భాగస్వాములుగా చేసి ఈ పంపిణీ సాగించాలని ఆశిస్తోంది. కానీ ఇదంతా అనవసరమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు తమలో తాము ఈ నీటిని పంచుకుంటే సరిపోతుందన్నది బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ పేర్కొంది.

 


ఈ ట్రిబ్యునల్ తీర్పుకి వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకి ఎక్కడంతో అక్కడా చుక్కెదురైంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీరు పట్ల తెలంగాణ ఏమంత సానుకూలంగా లేకపోవడంతో.. మున్ముందు ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సిందే! సమస్య ఎలాగొలా సామరస్యంగా పరిష్కారం అవుతుందా లేకపోతే కావేరీ జలవివాదంలాగా ఇరురాష్ట్రాలూ కొట్లాడుకునే పరిస్థితి వస్తుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది. అన్నదమ్ముల్లా విడిపోయిన ప్రజల మధ్య అలాంటి స్థితి రాకూడదనే ఆశిద్దాం! ఇందుకోసం ఇరురాష్ట్ర ప్రభుత్వాలూ కాస్త తమ బెట్టుని పక్కన పెట్టాల్సిందే.