TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్‌కు ప్రత్యేక దిల్లీ కావాలట

Published on: Fri Jun 24, 2016 4:41PM

 

ప్రపంచంలో ఏం జరిగినా దానిని దిల్లీకో, మోదీకో ముడిపెట్టి ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్‌కు అలవాటే. దాన్ని చూసి నవ్వుకోవడమో, ఉతికి ఆరేయడమో కూడా జనానికి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ప్రకారమే ఇప్పుడు కేజ్రీవాల్‌ మరోసారి ట్వీటారు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్‌ విడిపోయిన విధంగా, దిల్లీకి కూడా పూర్తి స్థాయి హోదా దక్కేందుకు రిఫరెండం జరగాలని ట్విట్టర్‌లో తన సందేశాన్ని అందించారు. నిజానికి దిల్లీ ఒక ప్రత్యేక హోదా! అటు రాష్ట్రమూ కాకుండా, ఇటు కేంద్ర పాలిత ప్రాంతమూ కాకుండా ఉన్న స్థితి. అందుకనే దిల్లీలో ఏదన్నా పొరపాటు జరిగితే కేజ్రీవాల్‌ కేంద్రం మీదా, కేంద్రం కేజ్రీవాల్‌ మీదా ఆరోపణలు చేసుకుని చేతులు దులిపేసుకునే పరిస్థితి.

 

ఈ స్థితిని చక్కదిద్దాలని అటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇటు భాజపా ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ బ్రిటన్‌ ఓ సమాఖ్య నుంచి విడిపోయిన ఈ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీదే నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు మీరే బ్రిటన్‌కు ప్రధానిగా ఎందుకు ఉండకూడదు అని ఒకరంటే... అసలు మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో, రెఫరెండం పెట్టండి చూద్దాం అని మరొకరు జవాబుగా ట్వీట్ చేశారు. ఇదంతా కాదుగానీ మీరు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయండి అని ఒకరంటే దిల్లీని ప్రత్యేక దేశంగా ప్రకటిస్తే పోలా అని మరొకరు నొసలు చిట్లించారు. ఏతావాతా.. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలతో నెట్టింత మరోసారి నవ్వులు పండాయి. ఇంతకీ, తను మరీ నవ్వులపాలైపోతున్న విషయం ఆయన గ్రహించారో లేదో!