క్షుద్రపూజల ఘటనలో డీహెచ్ శ్రీనివాసరావు!.. వామ్మో అందుకోసమా..?
Published on: Wed Apr 6, 2022 6:02PM
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు. కరోనా కాలంలో సీఎం కేసీఆర్ తర్వాత అంతగా పాపులర్ అయిన అధికారి. ఎప్పటికప్పుడు ప్రెస్‌మీట్లు పెట్టి.. కొవిడ్ అప్‌డేట్స్ ఇచ్చి.. ప్రజలకు సుపరిచితులుగా మారిపోయారు. మాస్కు ధరించడం తప్పనిసరి అంటూ చెప్పే ఆయనే.. ఓ మీడియా సమావేశానికి మాస్క్ లేకుండా రావడం.. ఓ వేడుకలో మాస్క్ లేకుండా డ్యాన్సులు చేయడం అప్పట్లో తెగ వైరల్ అయింది. డీహెచ్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కరోనా కేసులు లేవు కాబట్టి ఆయన సైతం టీవీల్లో కనిపించడం లేదు. కానీ, సడెన్‌గా శ్రీనివాసరావు మీడియాకు బ్రేకింగ్ న్యూస్‌గా మారిపోయారు. ఈసారి కొవిడ్ గురించి కాదు.. ఆయన గురించే షేకింగ్ న్యూస్ వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.....
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడిల శ్రీనివాస్ రావు వివాదంలో చిక్కుకున్నారు. ఖమ్మంలో డీహెచ్ శ్రీనివాస్ క్షుద్రపూజలు చేశారని అంటున్నారు. దేవుడు కరుణిస్తాడంటూ డీహెచ్ విచిత్ర పూజలు నిర్వహించారట. తనకు తాను దేవతనని ప్రకటించుకున్న టీఆర్‌ఎస్ ఎంపీపీ చుట్టూ ప్రదక్షిణలు చేశారని తెలుస్తోంది.
ఆ విషయం బయటకు పొక్కడంతో డీహెచ్ శ్రీనివాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజకీయ ఎంట్రీ కోసమే ఆయన అలా క్షుద్ర పూజలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలు ఇలాంటి పూజల కోసమేనని ఇప్పుడు అంటున్నారు.
గతంలో సిద్ధిపేట కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయినట్టే.. కొవిడ్‌తో తనకు వచ్చిన పాపులారిటీని ఓట్లుగా మరల్చుకునేందుకు రాజకీయాల్లో అడుగుపెట్టాలనేది ఆయన స్కెచ్ కావొచ్చు. పాలిటికల్ ఎంట్రీ కలిసివచ్చేలా ఇలా క్షుద్రపూజలు చేసుంటారని చెబుతున్నారు.
అయితే, అవి క్షుద్రపూజలు కావంటున్నారు శ్రీనివాసరావు. హోమ గుండంలో మిరపకాయలు వేసి, స్వయం ప్రకటిత దేవతతో కలిసి డీహెచ్ పూజలు నిర్వహించడంపై విమర్శలు రావడంతో ఆయన స్పందించారు. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని అన్నారు. జరిగినవి క్షుద్రపూజలు కావని.. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొన్నట్టు చెప్పారు. స్థానికులు ఆహ్వానం మేరకే ఆ పూజల్లో పాల్గొన్నానని వివరించారు. స్వయం ప్రకటిత దేవతతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు డీహెచ్ శ్రీనివాసరావు.



