TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి రైతుల పాదయాత్రకు బ్రేక్

Published on: Sat Oct 22, 2022 11:19AM

పోలీసుల  తీరుకు నిరసనగా అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి నుండి అరసవిల్లి వరకు   చేస్తున్న మహాపాదయాత్రకు నాలుగు రోజుల విరామం ప్రకటించారు. పోలీసులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కోర్టులోనే తేల్చుకుని పాదయాత్రను మళ్లీ ప్రారంభిస్తామని అమరావతి రైతుల ఐకాస ప్రకటించింది. కోర్టుకు సెలవులు ఉన్నందున పాదయాత్రకు నాలుగు రోజులు తాత్కాలిక విరామం మాత్రమే ఇస్తున్నట్లు ఐకాస వెల్లడించింది.

అమరావతి రైతుల మహా పాదయాత్ర ఈ రోజు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం బైపాస్ రోడ్డు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. రైతులు శుక్రవారం రాత్రి బస చేసిన ఫంక్షన్ హాల్ ను ఉదయాన్నే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి చుట్టుముట్టారు. ఈ సందర్భంగా బయటి నుంచి   రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. మద్దతు తెలిపేందుకు వస్తున్న వారని ఎక్కడికక్కడ నిలిపేశారు.

హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పాదయాత్రలో పాల్గొనే 600 మంది రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని ఒత్తిడి తెచ్చారు. అనుమతి ఉన్న వాహహనాలు తప్ప ఇంకే వాహనాన్నీ అనుమతించేది లేదంటూ పోలీసులు కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు- అమరావతి రైతుల మధ్య స్వల్పంగా వాగ్వాదం జరిగింది. దీంతో అమరావతి రైతుల ఐకాస నేతలు అప్పటికప్పుడు సమావేశమై పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.