TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ్రెజిల్ దేశాధ్యక్షుడిపై కేసు.. కారణం ఏంటో తెలుసా? 

Published on: Sun May 23, 2021 9:12PM

ఇండియాలో రాజకీయ నేతల హవా అంతా ఇంతా ఉండదు. చట్టాలను వాళ్లు పట్టించుకోరు. అంతా తాము చెప్పినట్లే జరగాలంటారు. ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి ఇండియాలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. ప్రస్తుతం రోజువారీగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే. మొత్తం వస్తున్న కేసుల్లో మూడో వంతు భారత్ లోనే వస్తున్నాయి. సెకండ్ వేవ్ విజృంభణకు ప్రభుత్వాలు, రాజకీయ నేతల నిర్లక్షమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. అయినా నేతల తీరు మారడం లేదు. మాస్కులు లేకుండానే జనంలోకి వెళుతున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా పట్టించుకోవడం లేదు. తమ అనుచరులను గుంపులుగా వెంటేసుకుని తిరుగుతున్నారు. అయినా వాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. కాని ఒక దేశంలో మాత్రం కొవిడ్ రూల్స్ పాటించలేదంటూ ఆ దేశ అధ్యక్షుడిపైనే కేసు నమోదు చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా ప్రభావానికి గురైన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇప్పటివరకు అక్కడ 1.6 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 4.48 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్ తీవ్రత కారణంగా బ్రెజిల్ లో కఠిన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు కూడా మినహాయింపు ఇవ్వలేదు. మాస్కు ధరించకుండా ఓ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.

మారనావో రాష్ట్రంలో ఆస్తి పట్టాల పంపిణీ కార్యక్రమం జరగ్గా, దేశాధ్యక్షుడు బోల్సొనారో చీఫ్ గెస్టుగా విచ్చేశారు. మాస్కు ధరించకపోగా, ఆ రాష్ట్ర ప్రభుత్వ పెద్దపై వ్యాఖ్యలు చేశారు. దేశాధినేత అయినా సరే మాస్కు లేకుండా కనిపించడంతో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని మారనావో గవర్నర్ ఫ్లావియో డైనో నిర్ధారించారు. చట్టం ఎవరికైనా ఒక్కటేనని డైనో స్పష్టం చేశారు. అధ్యక్షుడు బోల్సొనారో వైఖరి ఇప్పుడే కాదు, కొవిడ్ వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఇలాగే ఉంది. ఓసారి మీడియాతో మాట్లాడుతూ ఒక్కసారిగా మాస్కు తీసేసి అందరినీ హడలగొట్టారు. దేశంలో కరోనా మార్గదర్శకాల అమలులో విఫలం అయ్యారంటూ బోల్సొనారో చెడ్డపేరు తెచ్చుకున్నారు.