TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాను చనిపోతూ మరికొందరిలో బతికింది

Published on: Tue Jul 25, 2023 11:43AM

 బ్రెయిన్ డెడ్(జీవన్మృతులు) అవయవదానం చేయడం వల్ల మరికొందరిలో ఆశలుచిగురిస్తున్నాయి.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా అవయవాలు అమర్చి ప్రాణం పోస్తున్నారు.
ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన పూజ అనే బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా కోలుకోలేదు. చివరకు వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటించారు. దీంతో తమ కూతురు అవయవాలను దానం చేసి ఆ బాలిక తల్లిదండ్రులు మరికొందరికి జీవితాన్ని ప్రసాదించారు. జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్ జిల్లా తీగరాజుపల్లికి చెందిన పూజ ఇంటర్ చదువుతోంది. ఈ నెల 18న పూజ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. చివరి క్షణంలో పూజ తల్లిదండ్రులు గమనించి అప్రమత్తమయ్యారు. అయితే, అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న పూజను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ కు తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చుకుని వైద్యులు చికిత్స అందించారు.

అయితే, రోజులు గడిచినా పూజ ఆరోగ్యం మెరుగుపడలేదు. చికిత్సకు స్పందించకపోవడంతో ఈ నెల 24న పూజ బ్రెయిన్ డెడ్ కు గురైందని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో జీవన్ దాన్ ప్రతినిధులు పూజ తల్లిదండ్రులను కలిసి అవయవదానం గురించి వివరించారు. దీంతో తమ కూతురు మరికొందరి రూపంలో బ్రతికే ఉంటుందని పూజ తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. వైద్యులు పూజ కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, కార్నియాలను సేకరించి జీవన్ దాన్ సంస్థకు అందజేశారు.