బొత్స ఫోబియా!

 

 

 

ఇప్పుడు సీమాంధ్రులని కొత్త మనోవ్యాధి పట్టి పీడిస్తోంది. దానిపేరు ‘బొత్స ఫోబియా’. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేరు విన్నా, ఆయన గొంతు విన్నా, ఆయన్ని చూసినా, ఆయన గురించి ఆలోచన వచ్చినా సీమాంధ్రులు వణికిపోతున్నారు. విపక్షంలో ఎదురుగా వున్న శత్రువుని ఎదుర్కోవచ్చు. స్వపక్షంలో వెనుకే వున్న శత్రువుని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే, కరడుగట్టిన విభజనవాది కేసీఆర్‌ని చూసినా కలగని భయం సమైక్యవాది ముసుగులో వున్న సీమాంధ్రుడు బొత్సని చూస్తే సీమాంధ్రులకి కలుగుతోంది.

 

తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో సీమాంధ్రలో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ హైకమాండ్‌కి నివేదికలు ఇచ్చి, పరిస్థితిని ఇంతవరకు తెచ్చిన బొత్స గారంటే సీమాంధ్రులకు ఆమాత్రం భయం వుండటం న్యాయమే. చేసిందంతా చేసి నేను సమైక్యవాదినని బొత్స ఎలుగెత్తి చాటినా జనం నమ్మలేదు.  భవిష్యత్తులో బొత్స ఎన్ని మెత్తటి కబుర్లు చెప్పినా నమ్మకూడదన్న నిర్ణయానికి సీమాంధ్రులు వచ్చేశారు. అయితే సీమాంధ్ర ప్రజలు మరోసారి బొత్సబారిన పడే సందర్భం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిక ఇచ్చే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స మీదే వుంది. సదరు నివేదిక సమర్పించడానికి బొత్స సార్ సన్నాహాలు చేస్తున్నారు.



కాంగ్రెస్ హైకమాండ్‌కి చాలా గొప్ప నివేదిక ఇచ్చి ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన పరిస్థితులు తెచ్చిన బొత్స ఈసారి మంత్రుల బృందానికి ఎంత అందమైన నివేదిక ఇస్తారో, పరిస్థితిని ఇంకా ఎంత దిగజారుస్తారో అని సీమాంధ్ర ప్రజానీకం భయపడిపోతున్నారు.  పైకి ఎంత అందంగా సమైక్య వాదాన్ని వినిపించినా, సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవి మీద కన్నేసిన బొత్స రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండే విధంగానే మంత్రుల బృందానికి నివేదిక ఇస్తారన్న అనుమానాలు సీమాంధ్రులను పట్టి పీడిస్తున్నాయి. తెలుగు ప్రజలని బొత్స బారి నుంచి ఆ భగవంతుడే కాపాడాలి!