బొత్స జనసేన వైపు చూస్తున్నారా?

 

బొత్స సత్యనారాయణ.. తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా బొత్స బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసారు. ఇలా రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న బొత్స రాష్ట్ర విభజన అనంతరం కాస్త డల్ అయ్యారు. విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందంటూ ఏపీ ప్రజలు ఆ సమయంలో కాంగ్రెస్ మీద బాగా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో మెజారిటీ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు. కొందరు పూర్తిగా రాజకీయాలకే దూరమైతే.. కొందరు ఇతర పార్టీలలో చేరారు. వారిలో బొత్స ఒకరు. ముందుగా బొత్స టీడీపీలో చేరాలని చూసినా అటునుండి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో.. ఇక వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీలో కూడా బొత్స సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది.

బొత్సకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పని చేసిన అనుభవముంది. కానీ జగన్ తన సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వడంలేదని బొత్స భావిస్తున్నారట. రాష్ట్రస్థాయి నేతగా పేరుతెచ్చుకున్న తాను వైసీపీలో చేరాక జిల్లా నేత స్థాయికి దిగజారానని బొత్స ఫీల్ అవుతున్నారట. బొత్స అంతలా ఎందుకు ఫీల్ అవుతున్నారంటే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తూ.. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన జగన్.. తన నియోజకవర్గం వచ్చేసరికి తన పేరు చెప్పకుండా వెళతాడా?.. తాను తీసుకువచ్చిన 'కోలగట్ల వీరభద్రస్వామి'కి ముందే టిక్కెట్‌ ఇచ్చి తనకు ఇవ్వరా?.. ఎంత అవమానం?..  అని బొత్స ఫీల్ అవుతున్నారట. అంతేకాదు తన సంగతే ఇలా ఉంటే ఇక తన కుటుంబసభ్యుల టిక్కెట్ల సంగతేంటి? వారికి టిక్కెట్లు కష్టమేనా అని ఆవేదన చెందుతున్నారట. అసలే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. తనకి, తన కుటుంబానికి సీట్ల కేటాయింపు విషయంలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అవసరమైతే పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారట బొత్స. టీడీపీలో డోర్స్ ఓపెన్ అయ్యే అవకాశం తక్కువ కాబట్టి జనసేనవైపు చూస్తున్నారట. మరి బొత్స నిజంగానే వైసీపీలో తగిన ప్రాధాన్యత దక్కట్లేదని ఫీల్ అవుతున్నారా? అసలు ఆయనకు వైసీపీని వీడి జనసేనలో చేరే ఆలోచన ఉందా?.. అసలే పవన్ పార్టీలో చేరికల గురించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరి అలాంటి పవన్.. బొత్స పార్టీలో చేరతానంటే ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.