సంక్షోభాన్ని రాజకీయం చేస్తారా?: బొత్స

టీడీపీలా సంక్షోభాన్ని రాజకీయానికి వాడుకోవడం తమ పార్టీకి తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ ఘటన విషయంలో ప్రభుత్వ స్పందనను ఒక టీడీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు హర్షించాయని చెప్పారు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో టీడీపీ చేసే కామెంట్స్ చూసి బాధపడ్డామని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ఏ విషయంలో ప్రభుత్వానిది బాధ్యతారాహిత్యమో చెప్పాలని అన్నారు. చౌకబారు ఆరోపణలు చేయడం తగదన్నారు. 

భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడం కంపెనీ తప్పని అన్నారు. అయితే ఎల్జీ కంపెనీతో లాలూచీ పడుతున్నామంటూ చౌకబారు విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి పరిహారం వస్తుందా లేదా అనే తదుపరి విషయం అని, ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినా తప్పుపడతారా? అని ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ నేపథ్యంలో అత్యవసర సర్వీసుల కింద ఏ కంపెనీకి అనుమతులు ఇవ్వలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. 

అనుమతి పొందడానికి ముందు కంపెనీ ప్రతినిధులు పర్యవేక్షించే సమయంలో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. విశాఖలో పాలిమార్స్ కాలుష్య సమస్య పరిష్కారం అయ్యే వరకూ మంత్రులందరూ విశాఖలోనే ఉంటారని బొత్స తెలిపారు.