కొత్త పార్టీ దేనికో బొత్సకి తెలియదా

 

గత కొద్ది రోజులుగా సమైక్యాంధ్ర పేరుతో సాగుతున్నప్రచారం గురించి పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ తనదయిన శైలిలో బాష్యం చెప్పారు. సమైక్యాంధ్ర అంటూ సీమాంధ్ర అంతటా జరుగుతున్నప్రచారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకొనే కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారం మాత్రమేనని అబిప్రాయపడ్డారు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలో ఎవరయినా కొత్త పార్టీ స్థాపించితే పరవాలేదు కానీ, సమైక్యం పేరుతో ఎన్నికలలో ప్రజల ఓట్లు దండుకోవడం కోసమే స్థాపిస్తే మాత్రం ప్రజల చేతిలో భంగపాటు తప్పదని అన్నారు. తమ కాంగ్రెస్ పార్టీయే స్వయంగా రాష్ట్ర విభజన చేస్తున్నపుడు దానిని అడ్డుకోనేందుకే ఎవరయినా కొత్తపార్టీ స్థాపిస్తే పరవాలేదని పీసీసీ అధ్యక్షుడు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మళ్ళీ అదేనోటితో సమైక్య ముసుగులో పార్టీ స్థాపిస్తే మాత్రం భంగపాటు తప్పదని హెచ్చరించడం మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

 

నిత్యం కిరణ్ కుమార్ రెడ్డితో భుజాలు రాసుకు తిరిగే బొత్ససత్యనారాయణ, ఆయన ఎవరి ప్రోద్బలంతో, దేనికోసం కొత్త పార్టీ స్థాపించబోతున్నారో తెలుసుకోలేనంత రాజకీయ అజ్ఞాని కాదు. అందువల్ల ఆయన ఈ సమైక్య కాంగ్రెస్ డ్రామాలో రెండవ అంకం మొదలుపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లున్నారు. కానీ, నేడో రేపో వేరు కుంపటి పెట్టుకొని బయటకి పోయే కిరణ్ కుమార్ రెడ్డిని వెంటబెట్టుకొని, రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసేందుకు రేపు డిల్లీ వెళ్తామని బొత్స చెప్పడం కొస మెరుపు. కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎంత విధేయుడో మొన్న శాసనసభ సాక్షిగా నిరూపించుకొన్నారు. అందువల్ల బహుశః వారిరువురూ కొత్త పార్టీ గురించి చర్చించడానికే డిల్లీ వెళుతున్నారేమో ఎవరికి తెలుసు?