నాటికన్న నేడు బెటర్ : బొత్స
Published on: Sun Jan 22, 2012 11:07AM
హైదరా
బాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నా ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయనీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. నాడు 2009లో ఉన్న ప్రభుత్వం కన్నా ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని అవసరమైతే ఈ అంశంపై శ్వేత పత్రం విడదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ రెండో సమావేశం గాంధీభవన్లో జరిగింది. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశ వివరాలను బొత్స మీడియాకు వివరించారు. టిడిపి అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డిపై బొత్స విరుచుకు పడ్డారు.జగన్, చంద్రబాబు అబద్ధాలకు పేటెంట్లు పొందారన్నారు. 2009 తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి కూడా సంక్షేమ పథకాలను చేర్చడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వైఎస్ ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వమే సంక్షేమ పథకాలకు అధికంగా ఖర్చు పెడుతోందని బొత్స చెప్పారు. అవసరమైతే జగన్ వచ్చి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఆరు కిలోల బియ్యం, తొమ్మిది గంటల కరెంటు మినహా మిగతా పథకాలన్నీ వందశాతం అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిగురించి మాట్లాడకుండా పిల్లలకు ఫీజులివ్వలేదని, రైతులను పట్టించుకోలేదని బురద జల్లడం మానుకోవాలని బాబు, జగన్కు బొత్స హితవు పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు.


