TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్టీ ఫిరాయించేవాళ్లకే పదవులా?

Published on: Wed Jun 10, 2015 3:46PM

అనేక అనుమానాలు, ఊహాగానాల మధ్య బొత్సా సత్యనారాయణ ఎట్టకేలకు వైకాపాలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన బొత్సకు ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ కు ప్రజలలో అంత ఆదరణ లేకపోయేసరికి ఏ ఒక్కరికీ ఒక్క డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే బొత్సా ఖాళీగా ఉండలేక ఆఖరికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను వీడి అటు బీజేపీ లోకో ఇటు వైకాపా లోకో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కానీ బొత్సా ఈ వార్తలకు ఫులుస్టాప్ పెట్టి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వైకాపాలో చేరాల్సిన బొత్సా అప్పట్లో బేర సారాలు కుదరక పార్టీ మారలేదు. అప్పట్లో 8 ఎమ్మెల్సీ సీట్లు డిమాండ్ చేసిన బొత్సా దానికి వైకాపా అధ్యక్షుడు జగన్ అంగీకరించకపోవటం.. తరువాత 4 సీట్లతో పాటు బొత్సాను ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ను చేసేలా ఒప్పందం కుదుర్చుకొని ఫార్టీ ఫిరాయించారు. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖజిల్లాలో అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి అక్కడ ఓ బలమైన నాయకుడిని నిలబెట్టాలని జగన్ చూస్తున్న నేపథ్యంలో బొత్స ఇదే అదను చూసుకొని వైకాపాలోకి జంప్ చేశారు. కానీ బొత్సా రాక వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఆనందాన్నిచ్చినా ఆపార్టీలో కొంత మంది ఆసంతృప్తిగా ఉన్నారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

 

మరోవైపు బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్ రంగారావు సోదరులు విజయనగరంజిల్లా నుండి వైకాపా పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకోసమే పనిచేసి ఎంతో సేవ చేసిన నాయకులు. వైకాపా లో బొత్సా చేరుతున్నారు అన్న వార్త తెలిసినప్పటి నుండే అలకపాన్పుకెక్కారు ఈ సుజయ్ సోదరులు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండగలవా.. అసలే గతం నుండే బొత్సా, సుజయ్ రంగారావు సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి... ఈ నేపథ్యంలో బొత్స చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. బొత్స పార్టీలో చేరటంతో జగన్ మీద పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నారు సుజయ్ సోదరులు. పార్టీ లో ఉండి పార్టీకి పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదుకాని, బయటి పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడతారని వారికి మంటెక్కి వైకాపా నుండి తెలుగుదేశం పార్టీకి మారే యోచనలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సుజనా రంగారావు సోదరుడికి ఎమ్మెల్సీ సీటుకూడా కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

 

మొత్తానికి రాజకీయాలు ఎలా మారిపోయాయంటే ఎవరు ఏ పదవి ఇస్తానంటే ఆ పార్టీలోకి చేరిపోయి ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేలా తయారయాయి. పార్టీ అధ్యక్షులు కూడా ఎంతోకాలం పార్టీలో నమ్మకంగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడి ఉన్నవారికి మాత్రం పదవులు ఇవ్వకుండా పార్టీలు జంప్ చేసేవారికి ఇవ్వడం కూడా ఆశ్చర్యకరం. అసలు జగన్ పార్టీ స్థాపించినప్పుడు దోచుకున్నదే దోచుకోవడానికి పార్టీ పెడుతున్నాడని జగన్ ను విమర్శించిన బొత్సా.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం.. జగన్ బొత్సాకు ఆహ్వానం పలకడం చూస్తుంటే రాజకీయమంటే ఇదేనేమో అనిపిస్తుంది. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందిన సుజయ్ పార్టీని వీడితే, తమకు భారీ నష్టం తప్పదని కూడా ఆ పార్టీ వర్గాలు అంచనా వేసి సుజయ్‌ని శాంతపరిచేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు.