తీర్పు ఊహించిందే.. మళ్లీ బిల్లు పెడతాం.. అమరావతిపై అదే పంతం!
Published on: Thu Mar 3, 2022 2:34PM
సర్కారు ఎక్కడా తగ్గట్లేదు. హైకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. తగ్గేదేలేదంటోంది. అమరావతిని 6 నెలల్లో కంప్లీట్ చేయాలని.. 3 నెలల్లో రైతుల ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని.. కార్యాలయాలు తరలించ వద్దని.. సంచలన తీర్పు ఇచ్చినా.. లైట్ తీసుకుంటోంది వైసీపీ ప్రభుత్వం.
అమరావతిపై హైకోర్టు తీర్పులో ఏముందో తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తీర్పు పూర్తిగా చదివాక అన్ని విషయాలపై మాట్లాడతానన్నారు. "హైకోర్టు తీర్పు మేము ఊహించిందే. అందులో కొత్తగా ఏమీ లేదు. పరిపాలన వికేంద్రీకరణ చేయాలనేది మా ఉద్దేశం. మూడు రాజధానుల ఏర్పాటుకు ఈ క్షణం వరకు కట్టుబడి ఉన్నాం. త్వరలో మూడు రాజధానుల బిల్లు పెడతాం.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలో లేదో చర్చించి చెబుతాం.. చట్టాలు చేసేందుకే శాసనసభ, పార్లమెంట్ ఉన్నాయి. శాసనసభలో చట్టాలు చేయకూడదంటే ఎలా? మూడు నెలల్లో ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యమా లేదా చూడాలి" అని అన్నారు మంత్రి బొత్స.
మరోవైపు, రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేశారు.


