TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మీడియా సమావేశంలో బొత్స కన్నీరుమున్నీరు

Published on: Fri Apr 10, 2026 9:27AM

సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత  బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా బరస్ట్ అయిపోయారు. మీడియా సమావేశంలోనే వెక్కివెక్కి ఏడ్చారు.  తెలుగుదేశం  నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు.  

వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆనాడు తానే స్వయంగా జగన్ పక్కన ఉండి, ఆయనను ఓదార్చానని చెబుతూ బొత్స కన్నీరుమున్నీరయ్యారు. అచ్చెన్నాయుడు తనపై చేసిన అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న సంతకాల వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని బొత్స ఈ సందర్భంగా చెప్పారు. ఈ సంగతి   రఘువీరారెడ్డి,  కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలకు  తెలుసన్నారు. అచ్చెన్నాయుడు కేవలం తన పదవిని కాపాడుకోవడానికే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దివంగత నేత వైఎస్ఆర్ గురించి అనుచితంగా మాట్లాడటం వల్లే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన వివరించారు.