బీఏ చదివిన బొత్సకు విద్యాశాఖ!.. ఇదేంది జగనన్న?
Published on: Mon Apr 11, 2022 5:10PM
సీఎం జగన్ కొత్త కేబినెట్ సంచలనాలకు వేదికైంది. అసంతృప్తులు ఆవేశంతో రగిలిపోతున్నారు. పదవి వరించిన వారు పండగ చేసుకుంటున్నారు. రోజాకు ఎన్నాళ్లో వేచిన ఉదయం ఆవిష్కృతమైంది. రజినీ మరింత వెలిగిపోతోంది. జోగి, అంబటిలను అందలం ఎక్కించారు జగనన్న. పదవులే కాదు వారికిచ్చిన శాఖలు కూడా సంచలనమే. బుగ్గనను మరోసారి ఆర్థికం అప్పగించి ఆయనపై నమ్మకం ఉంచారు. పెద్దిరెడ్డి పోర్ట్‌ఫోలియోను కాస్త తగ్గించారు. ఇక, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ విషయంలోనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత కేబినెట్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు చేపట్టిన బొత్స.. అమరావతిని స్మశానంతో పోల్చి తీవ్ర ఆగ్రహ జ్వాలలకు గురయ్యారు. తాజా, కేబినెట్‌లో బొత్సకు విద్యాశాఖ కట్టబెట్టి.. ఆ జ్వాలను కాస్త చల్లార్చే ప్రయత్నం చేశారు సీఎం జగన్.
అయితే, బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ కేటాయించడం మరింత వివాదాస్పదమవుతోంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ, పలుమార్లు ఎమ్మెల్యేగా, నలుగురు సీఎంల హయాంలో మంత్రిగా విశేష అనుభవం గడించారు. ఆయన మాట్లాడేది సరిగా అర్థం కాకపోయినా.. సెటైర్లు, ఎటకారం ఎక్కువే అయినా.. ఆయన రాజకీయ, పాలనా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని.. బొత్సకు మంత్రి పదవి ఇవ్వక తప్పనిసరి పరిస్థితి ఉంటుంది. కానీ, జగన్‌రెడ్డి ఈసారి ఆయనకు విద్యాశాఖ ఇవ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది విద్యాలోకం.
బొత్స చదివింది బీఏ మాత్రమే. విద్యాశాఖ అంటే స్కూల్స్, కాలేజేస్, యూనివర్సిటీస్, ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్స్.. ఇలా కీలక విద్యావ్యవస్థలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉన్నత విద్యావంతులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మరి, బీఏ చదివిన ఆయన.. నేటి ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై అవగాహన, ఆ స్థాయి నాలెడ్జ్ ఉంటుందా? అంటే అనుమానమే అంటున్నారు. అందుకే, బొత్సాకు మరీ విద్యాశాఖ ఇవ్వడం ఏంటంటూ సీఎం జగన్‌ను తప్పుబడుతున్నారు.
గత కేబినెట్‌లో రైల్వేశాఖలో ఉన్నతోద్యోగిగా పని చేసిన అనుభవం ఉన్న ఆదిమూలపు సురేశ్ విద్యాశాఖ బాధ్యతలు నిర్వహించారు. కరోనా ఉన్నా.. పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసి హంగామా చేశారు. మంత్రి సురేశే అయినా.. నిర్ణయాలన్నీ సీఎం అండ్ సీఎంవోనే తీసుకుంటుందని అంటారు. ఎవరైనా పేరుకే మంత్రి. ఆ కోవలోనే బొత్సాకు సైతం విద్యాశాఖ అప్పగించారని అనుకోవచ్చు. కాకపోతే, ఇంకాస్త చదువుకున్నవారికి ఆ శాఖ ఇచ్చుంటే, కాస్త హుందాగా ఉండేదని అంటున్నారు. అయితే, బాగా చదువుకున్న వారికే విద్యాశాఖ ఇవ్వాలనే రూల్ అయితే లేదు. సామర్థానికి చదువుతో పని లేదు. అంతెందుకు, డిగ్రీ చదివిన జగనన్న ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏలడం లేదా? కాకపోతే, ఆ మేరకు ఫలితాలు దారుణంగా ఉన్నాయనుకోండి అది వేరే విషయం అంటున్నారు.
బొత్స సత్యనారాయణ 1978లో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగారు. 1992 నుంచి 1999 వరకు రెండుసార్లు విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా పని చేశారు. 1996లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, 1999లో అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2004, 2009ల్లో చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి 2019లో మళ్లీ గెలిచారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కీలకశాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 2012 నుంచి 2015 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. జగన్ కేబినెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా కొనసాగనున్నారు బొత్స సత్యనారాయణ, బీఏ.


