విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష.. మంత్రి బొత్స డుమ్మా..
Published on: Wed Apr 13, 2022 1:21PM
బొత్స సత్యనారాయణకు విద్యాశాఖ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు, సెటైర్లు వస్తున్నాయి. గతంలో ఓ నేషనల్ మీడియాతో బొత్స ఇంగ్లీషులో మాట్లాడిన పాత వీడియో కొత్తగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో బొత్స గారి బ్రోకెన్ ఇంగ్లీష్‌పై తెగ కామెంట్లు, సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. బీఏ చదివిన బొత్స.. విద్యాశాఖ మంత్రి కావడం విద్యార్థుల కర్మ అంటూ తెగ చర్చ నడుస్తోంది. ప్రజలు అనుకుంటున్నట్టే.. మంత్రి బొత్స తీరు కూడా ఉన్నట్టుంది. సీఎం జగన్ విద్యాశాఖపై నిర్వహించిన తొలి సమీక్షకు ఆ శాఖ మంత్రి బొత్స డుమ్మా కొట్టడం విమర్శల పాలవుతోంది.
మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం తొలిసారిగా విద్యాశాఖపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకాలేదు. విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు సహా ఇతర అంశాలపై సీఎం సమీక్ష ఏర్పాటు చేశారు. అయితే, తన గౌర్హాజరుపై బొత్స సత్యనారాయణ ముందుగానే.. సీఎం కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. తన సోదరుడి కుమార్తె వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నందున సమీక్షకు హాజరుకాలేనని బొత్స చెప్పినట్టు తెలుస్తోంది. పరీక్షలపై విద్యాశాఖ సమీక్ష కంటే.. బంధువుల పెళ్లి ఏర్పాట్లు ముఖ్యమా అంటున్నారు కొందరు.


