బొత్స వర్గం ముఖ్యమంత్రికి పొగబెడుతోందా

 

కొద్ది రోజుల క్రితం దివాకర్ రెడ్డి తమ పార్టీతో జగన్ కి సంబంధాలున్నాయని ప్రకటించినప్పుడు బొత్స సత్తిబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘క్రమశిక్షణ పాటించలేకపోతే పార్టీలో నుండి బయటకు వెళ్ళిపొమ్మని’ హెచ్చరించారు. దానిపై లగడపాటి స్పందిస్తూ, “అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అదేమాట చెప్పే దైర్యం ఉందా?” అని ప్రశ్నించారు. దీనికి బొత్స వద్ద సమాధానం లేదు. కానీ, ముఖ్యమంత్రి వ్యతిరేఖ వర్గంలో ఆయనతో బాటు ఉన్న మరికొంత మంది మంత్రులలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా ఒకరు.

 

అప్పుడపుడు ముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా గళం సవరించుకొనే ఆయన మళ్ళీ నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చేంత రాజకీయ శూన్యతేమి లేదు. వచ్చినా అవి నిలద్రోక్కుకోలేవు కూడా,” అని కిరణ్ కుమార్ రెడ్డికి పరోక్షంగా చురకలు వేసారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వాపును చూసి బలుపనుకొంటున్నారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. అంతే గాక “పార్టీ నుండి బయటకు వెళ్లిపోదలచిన వారిని ఎవరూ ఆపబోరని, నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చునని,” ఆయన అనడం బహుశః ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, దివాకర్ రెడ్డి, లగడపాటి వంటి వారిని ఉద్దేశ్యించి అన్నవేనని అర్ధం అవుతోంది.

 

అయితే బొత్స పలుకవలసిన పలుకులు ఆయన నోట పలుకుతున్నారంటే అందుకు బొత్స ప్రోత్సాహం ఉందని భావించాలేమో. తెలంగాణా కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోమని అడుగుతుంటే, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆయనను పార్టీ నుండి బయటకి పోతే బాగుటుందని ఎందుకు కోరుకొంటున్నారో?

 

అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ప్రజలలో సమైక్యవాదిగా ముద్ర వేసుకొన్నకిరణ్ కుమార్ రెడ్డి, పార్టీలో ఉండగా రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తమకి ముఖ్యమంత్రి పదవి దక్కదనే సత్యం గ్రహించినందునే బొత్స తదితరులు ఆయనకి పొగపెడుతున్నారేమో!