మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకే రకం..!!

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా శేరిలింగంపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు.. దేశంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఇద్దరూ పరిపాలనలో, ప్రజల్ని మోసగించడంలో ఒకేరకంగా ముందుకెళుతున్నారని అన్నారు.. 'విదేశాల నుంచి నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ చెప్పారు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా అందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానన్నారు.. నాలుగేళ్లలో ఆయన ప్రజల ఖాతాలో ఒక్కపైసా వేయలేదు.. ఈయన నాలుగేళ్లలో ఐదువేల ఇళ్లు కట్టించలేదు' అని విమర్శించారు.

 

 

తెలంగాణ అవినీతికి రాజధానిగా మారిందని ఆరోపించారు.. ఇక్కడ అంతా ఒక కుటుంబం చుట్టే తిరుగుతోందని, ఇందులో సామాన్య ప్రజలు బాగుపడిందేమీ లేదని అన్నారు.. తాము మిగులు రాష్ట్రాన్ని అప్పగించామని, దాన్ని అప్పుల పాలు చేశారని రాహుల్‌ మండిపడ్డారు.. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం కొన్ని హామీలు ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణకు రావాల్సిన హక్కులు ఈ రోజుకీ ఢిల్లీ నుంచి ఎందుకు రాలేదు?.. పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే నేతలు, హామీలు ఎందుకు పూర్తి చేయరు?.. తెలంగాణ ప్రభుత్వం పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ప్రతి విషయంలో మోదీ సర్కారును ఎందుకు సమర్ధించింది?.. తెలంగాణ ప్రభుత్వానికి పనులు చేయనపుడు సీఎం ఎందుకు పార్లమెంటులో ప్రతి బిల్లును సమర్థిస్తారు? అని ప్రశ్నించారు.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగింది కాంగ్రెస్సే.. మిగతా పార్టీలు అడగలేదు.. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా హామీ నెరవేరుస్తాం.. తెలంగాణకు ఇచ్చిన హమీలూ తీరుస్తాం.. కేంద్ర ప్రభుత్వ హమీలన్నీ మీ హక్కులు.. మీ సీఎం, మోదీ చేసినా, చేయకున్నా వాటిని నెరవేర్చడం మా బాధ్యత అని రాహుల్ స్పష్టం చేసారు.