TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఇంటి వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన..!

Published on: Tue Aug 4, 2026 3:17PM

 

జగన్ దర్శనం దక్కకుండా సజ్జల అడ్డుకుంటున్నారు..!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం సమీపంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాస ప్రాంగణం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసనకు దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జగన్‌ను కలిసేందుకు తనను అనుమతించడం లేదంటూ ఆయన అక్కడే ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిపై బోరుగడ్డ అనిల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సజ్జల కావాలనే తనపై కుట్రలు పన్నుతున్నారని, జగన్‌ని కలవకుండా తనను అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేతకు తనకు మధ్య దూరం పెంచేందుకు సజ్జల శ్రమిస్తున్నారని అనిల్ ఆరోపించారు.

తనను రౌడీషీటర్‌గా చిత్రీకరించేందుకు సజ్జల  ఆయన అనుచరులు యత్నిస్తున్నారని అనిల్ ధ్వజమెత్తారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని గతంలోనే హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారాలు చేసిన వారికి న్యాయపరమైన నోటీసులు జారీ చేశామని, ఈ విషయంలో దాదాపు 12 మంది పోలీసు అధికారులకు కూడా కోర్టు మెమోలు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

తన నేపథ్యాన్ని వివరిస్తూ.. తాను లండన్‌లో ఉన్నత విద్య (పీజీ) పూర్తి చేశానని, తండ్రి మరణం అనంతరం సొంతూరుకి తిరిగి వచ్చి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం కోసం అహర్నిశలు శ్రమించానని తెలిపారు. వైఎస్సార్ సమాధి వద్ద ప్రమాణం చేసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయడం కోసం కష్టపడ్డానని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులతో కూడా తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో బోరుగడ్డ అనిల్ వైఎస్‌ఆర్‌సీపీ నేతగా చెప్పుకున్నప్పటికీ, ఆయన వ్యాఖ్యలు వివాదాల నేపథ్యంలో పార్టీకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్‌ఆర్‌సీపీ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిణామాల అనంతరం కూడా అనిల్ నేరుగా జగన్ నివాసానికే వచ్చి నిరసన తెలపడం గమనార్హం.

ఈ వ్యవహారంతో తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్‌ఆర్‌సీపీ అంతర్గత విభేదాలు మరియు అనిల్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ ఘటనపై పార్టీ అధిష్ఠానం లేదా సజ్జల రామకృష్ణారెడ్డి వర్గం ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో అనిల్ ఆరోపణలపై చట్టపరమైన లేదా రాజకీయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.

Borugadda Anil, YS Jagan, Tadepalli Protest, Sajjala Ramakrishna Reddy, AP Politics