తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ తో హైకోర్టుకు బోరుగడ్డ బురిడీ
Published on: Fri Mar 7, 2025 10:12AM
టిడిపి అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కళ్యాణ్ ను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో వైకాపా నేత బోరుగడ్డ అనిల్ హైకోర్టును తప్పు దోవ పట్టించారు. తన తల్లికి అనారోగ్యం ఉందని తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి మధ్యంతర బెయిల్ పొందారు. రాజమహేంద్రవరంలో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు బోరుగడ్డ ఫేక్ సర్టిఫికేట్లతో కోర్టును తప్పు దోవపట్టించారు. గత నెల 14న ఆయనకు బెయిల్ వచ్చింది. అదేనెల 15 నుంచి 28 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గడువు ముగియగానే బోరుగడ్డ కోర్టులో లొంగిపోయారు.
మార్చి ఒకటో తేదీన బోరుగడ్డ మరో పిటిషన్ వేశారు. తల్లికి తానొక్కడినే అని ఆమె ప్రస్తుతం చెన్నయ్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని, రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. చెన్నయ్ లోని అపోలో ఆస్పత్రిలో తల్లి చికిత్స పొందుతుందని గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ చీఫ్ కార్డియాలజిస్ట్ రాఘవశర్మ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు బోరుగడ్డ కోర్టుకు సమర్పించారు. ఈ సర్టిఫికేట్ పై విచారణ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో బోరుగడ్డ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ నకిలీదని వెల్లడైంది.


