TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ ఏడైనా చదువులు సాగుతాయా?

Published on: Mon Jun 6, 2022 8:25AM

తెలంగాణ ప్రభుత్వం చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్ష్యానికి తిలోదకాలిచ్చేసినట్లు కనిపిస్తోంది. కేజీటూ పీజీ అంటూ తొలి నాళ్లలో ఊదరగొట్టిన కేసీఆర్ సర్కార్ ఆ తరువాత దానిని పూర్తిగా మర్చిపోయింది. ఇక ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలను విద్యార్థులకు అందజేయాలన్న లక్ష్యానికీ నీళ్లోదిలేసింది. ఈ నెల 13 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నా..ఇప్పటి వరకూ కనీస స్థాయిలో కూడా పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. జిల్లా కేంద్రాలకూ, పాఠశాలలకూ చేరాల్సిన పాఠ్య పుస్తకాల సరఫరా జరగలేదు. ఎప్పటికి సరఫరా చేస్తారన్న సమాచారమూ లేదు. కరోనా కారణంగా రెండేళ్లు పుస్తకాల చదువులకు దూరమై.. ఆన్ లైన్ క్లాసులకే పరిమితమైన విద్యార్థులు ఈ ఏఢాదీ అదే పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చేలా ఉంది. ఆఫ్ లైన్ క్లాసులు అంటూ పాఠశాలకు వెళ్లినా ఉపాధ్యాయులు చెప్పేది వినడం వినా పుస్తకాలు చూసి చదువుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఏటా పాఠశాలల ప్రారంభానికి వారం రోజుల ముందే పుస్తకాలు అందుబాటులోనికి వచ్చేవి. అయితే ఈ ఏడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.

పుస్తకాలు చూస్తూ, టీచర్ చెప్పేది వింటేనే పాఠాలు విద్యార్థులకు వంటబడతాయి. స్కూళ్లో విన్నది..ఇంటి దగ్గర చదువుకోవాలంటే పుస్తకాలు కావాలి. వాటిని విద్యార్థులకు దూరం చేసి విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ గప్పాలు కొట్టుకోవడం వల్ల ఉపయోగం శూన్యం. ఇదీ విద్యారంగ నిపుణులు చెబుతున్న మాట. అయితే ప్రభుత్వం మాత్రం పాఠపుస్తకాల ముద్రణ, సరఫరా విషయంలో క్షంతవ్యం కాని అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ నెల 13 నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండగా, ఇప్పటి వరకూ కేవలం పాతిక లక్షల పుస్తకాల పంపిణీ మాత్రమే జరిగింది. ఇంకా కోటీ పాతిక లక్షల పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉంది. అవి ఎప్పటికి పాఠశాలలకు చేరుతాయన్న కనీస సమాచారం కూడా లేదు. అధికారులు మాత్రం ఈ నెలాఖరు వరకూ పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని చెబుతున్నా..ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదని అంటున్నాయి. జూలై నెలాఖరుకు పుస్తకాలు అందినా గొప్పేననని అంటున్నారు. అంటే పాఠశాలలు తెరిచిన తరువాత కూడా రెండు, మూడు నెలల వరకూ విద్యార్థులు పుస్తకాలు లేకుండానే చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి ఉందన్న మాట. గత రెండేళ్లూ పుస్తకాలు లేకండానే చదువులు సాగాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేసిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు.

గత రెండేళ్ల పరిస్థితి కారణంగా చాలా మంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడ్డారనీ, ఇప్పుడు కూడా పుస్తకాలు సమయానికి అందుబాటులో ఉంచని పరిస్థితి కారణంగా విద్య వెనుకబాటు అనివార్యంగా కనిపిస్తోందనీ అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగానే పుస్తకాణ ముద్రణ, సరఫరాలో అలవిమాలిన జాప్యం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికైనా పుస్తకాల ముద్రణా సరఫరాల్లో వేగం పెంచి కనీసం ఈ నెల చివరికైనా వాటిని విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యారంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే వరుసగా మూడో సంవత్సరం కూడా విద్యార్థులు చదువులకు దూరం అయ్యే పరిస్థితి ఉత్పన్నమౌతుందని హెచ్చరిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత విద్య, వైద్య రంగాలేననీ, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ రెండు రంగాలనూ నిర్లక్ష్యం చేసి ఓట్లు రాల్చి పెడతాయని భావిస్తున్న సంక్షేమ పథకాలకు అగ్ర తాంబూలం ఇస్తోందనీ పరిశీలకులు విమర్శిస్తున్నారు.