అలసిపోయి ఫ్యాన్ నీడకు బొండా ఉమ ?

 

ఇప్పటికే పార్టీ ఓటమి, కీలక నేతల జంపింగ్ తో ఇబ్బంది పడుతున్న టీడీపీకి ఆ పార్టీ కీలక నేత బోండా ఉమా కూడా షాక్ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి వైసీపీ నేత మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలైన బోండా ఉమా ఆ తరువాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఏక్టివ్ గా పాల్గొనడం లేదనే చెప్పాలి. ఆమధ్య కాపు నేతలు అంతా సమావేశమై చర్చలు జరిపినప్పుడు హాజరైన బోండా ఉమా ఆ తరువాత పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కీలక భేటీ కి హాజరు కాలేదు. 

అయితే ఆ తర్వాత వెళ్లి చంద్రబాబును కలిసివచ్చినా ఆయన పార్టీ మార్పు తధ్యం అనే ప్రచారం సాగుతోంది. అయితే ముందు ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, తన దూకుడుకి వైసేపీ కరెక్ట్ అని అక్కడ అయితే తనకు త్వరగా గుర్తింపు దొరుకుతుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని కూడా కలిసి బోండా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి ఏకు మేకై నిలిచిన నాయకుల్లో బోండా ఉమా ఒకరు. అలాంటిది ఇప్పుడు పార్టీలోకి వస్తానంటే వైసీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  చూడాలి మరి ఏమవుతుందో ?